PV Sindhu on Cyber Crime: సైబర్ నేరాల బారిన పడిన మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని... తాను కూడా సైబర్ బుల్లింగ్, ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నానని ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. హైదరాబాద్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ఆన్‌లైన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి... నివారణ చర్యలపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులను సైబర్ వారియర్స్‌గా తీర్చిదిద్దడం పట్ల పీవీ సింధు సంతోషం వ్యక్తం చేశారు.
కొవిడ్ కారణంగా రెండేళ్లుగా అంతర్జాల వినియోగం పెరిగిందని... దాంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగాయని పీవీ సింధు తెలిపారు. పిల్లలు కంప్యూటర్లు, చరవాణిలు ఉపయోగించేటప్పుడు తల్లిదండ్రులు గమనిస్తుండాలని ఆమె సూచించారు. మహిళల భద్రతకు షీటీమ్‌లు ఎంతో కృషి చేస్తున్నాయని... సైబర్ నేరాల బారిన పడే బాధితుల కోసం ఒక వేదిక ఏర్పాటు చేయాలని పీవీ సింధు కోరారు. నిరంతరం శ్రమించడం, అనుకున్న లక్ష్యం సాధించాలనే తపనతోనే ఈ స్థాయికి ఎదిగానని పీవీ సింధు విద్యార్థులకు తెలిపారు.