ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: నేడు వరంగల్, ఖమ్మం పురపోరుకు సమర శంఖం

By

Published : Apr 15, 2021, 8:50 AM IST

మినీ పురపోరుకు నేడు నగారా మోగనుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలతోపాటు మరో ఐదు పురపాలికలకు ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవాళ ఉదయం వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించి ఈ నెల 30న పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడా సహా మరో ఎనిమిది మున్సిపాలిటీల్లోని వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.

elections
ఎన్నికలు

గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికల ఎన్నికలకు సర్వం సిద్దమైంది. వరంగల్, ఖమ్మం, అచ్చంపేట పాలకవర్గాల గడువు గత నెల 14న ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. సిద్దిపేట పాలకమండలి పదవి కాలం ఇవ్వాళ్టితో పూర్తి కానుంది.

కలెక్టర్లు ప్రకటన

జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. వార్డుల వారీ ఓట్లర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇవాళ ఉదయం వార్డుల వారీ రిజర్వేషన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటిస్తారు.

ఇవాళ నోటిఫికేషన్

కొత్తగా ఏర్పాటైన జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల ఛైర్​పర్సన్ పదవుల రిజర్వేషన్లు కూడా ఇవాళ వెల్లడి కానున్నాయి. ఈ మూడు చోట్లా మహిళలకు పదవులను రిజర్వ్ చేసేందుకు ఉదయం పురపాలకశాఖ సంచాలకులు రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ తీస్తారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి ప్రభుత్వం నుంచి అందగానే నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసి రేపు స్థానికంగా నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

ఈ నెల 30న పోలింగ్!

పురపాలక చట్టం ప్రకారం నామినేషన్లు ప్రారంభమైన తేదీ నుంచి 15వ రోజు పోలింగ్ జరగాలి. ఆ లెక్కన ఈ నెల 30న పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితోపాటు ఇతర పట్టణాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లింగోజిగూడతో మరో ఎనిమిది మున్సిపాలిటీల్లో ఒక్కో డివిజన్ ఖాళీగా ఉంది. గజ్వేల్, నల్గొండ, జల్​పల్లి, అలంపూర్, బోధన్, పరకాల, మెట్ పల్లి, బెల్లంపల్లిలో ఖాళీగా ఉన్న ఒక్కో డివిజన్​కు కూడా ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు.

ఇదీ చూడండి :ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల ఎప్పుడో..?

ABOUT THE AUTHOR

...view details