ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆగిన సేవకూ బాదుడే.. పుర, నగరపాలక సంస్థల అడ్డగోలు వసూళ్లు - Pura and municipal corporations levying taxes on discontinued services

* ఇళ్ల నుంచి మల, మూత్ర విసర్జితాలను కార్మికులు సేకరించే విధానం ఎప్పుడో రద్దయింది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం అమలులోకి వచ్చాక పేదలు ప్రభుత్వ సాయంతో ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారు. వ్యర్థాలతో నిండే సెప్టిక్‌ ట్యాంకులను ప్రైవేటు సంస్థలతో శుభ్రం చేయించుకుంటున్నారు. ఎప్పుడో నిలిచిపోయిన సేవలకు స్కావెంజింగ్‌ పేరుతో పుర, నగరపాలక సంస్థలు ఇప్పటికీ పన్నులు వసూలు చేస్తున్నాయి. * తాగునీటి కుళాయి కనెక్షన్లపై ప్రజలు రుసుములు చెల్లిస్తున్నా మళ్లీ నీటి పన్ను వసూలు చేస్తున్నారు. వీధి కుళాయిలను మురికివాడల్లో తప్పితే మిగతా చోట్ల దాదాపుగా తొలగించారు. అయినా పుర, నగరపాలక సంస్థలు నీటి పన్ను వసూలు చేస్తున్నాయి. * భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) అందుబాటులో ఉన్న చోట ప్రతి ఇంటికీ కనెక్షన్‌ తీసుకోవడం తప్పనిసరి చేశారు. 14 నగరాలు, పట్టణాల్లో యూజీడీ వ్యవస్థ ప్రస్తుతం అందుబాటులో ఉంది. యూజీడీ కనెక్షన్లపై పుర, నగరపాలక సంస్థలు రుసుములు వసూలు చేస్తున్నాయి. ఈ వ్యవస్థ అమలులో ఉన్నచోట కాలువలు శుభ్రం చేసే పని తప్పింది. మురుగునీరు భూగర్భంలోని పైపుల ద్వారా నీటి శుద్ధి ప్లాంట్లకు చేరుతోంది. అయినా ప్రజల నుంచి డ్రైనేజీ పన్ను వసూలు చేస్తున్నారు.

ఆగిన సేవకూ బాదుడే.. పుర, నగరపాలక సంస్థల అడ్డగోలు వసూళ్లు
ఆగిన సేవకూ బాదుడే.. పుర, నగరపాలక సంస్థల అడ్డగోలు వసూళ్లు

By

Published : Jun 3, 2022, 5:24 AM IST

పట్టణ ప్రజలకు అందించే కొన్ని సేవలు కాలక్రమంలో కనుమరుగవుతున్నా పుర, నగర పాలక సంస్థలు స్కావెంజింగ్‌, డ్రైనేజీ, నీటి పన్నులు వసూలు చేస్తూనే ఉన్నాయి. నూతన ఆస్తి పన్ను విధానం అమలులోకి వచ్చాక ప్రజలకు మొదట్లో పన్ను నోటీసులు జారీ చేయని పట్టణ స్థానిక సంస్థలు రెండో ఏడాది నుంచి ఇవ్వడం ప్రారంభించాయి. వీటిలోనూ ఆస్తి మూల ధన విలువ ప్రకారం విధించిన మొత్తం పన్ను, లైబ్రరీ సెస్సు, అనుమతుల్లేని నిర్మాణాలపై పెనాల్టీ వివరాలే కనిపిస్తాయి. మరింత స్పష్టత కోసం పలువురు తమ ఇళ్లకు (అసెస్‌మెంట్‌) సంబంధించిన డిమాండ్‌, కలెక్షన్‌, బ్యాలెన్స్‌ (డీసీబీ) జాబితాలను పురపాలకశాఖ వెబ్‌సైట్‌లో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇళ్లు, వాణిజ్య భవనాలపై ఆస్తి పన్నుతో (జనరల్‌ ట్యాక్స్‌)పాటు స్కావెంజింగ్‌, డ్రైనేజీ, లైటింగ్‌, నీటి పన్నులు ఇందులో ఉన్నాయి. యూజీడీ, వాటర్‌ కనెక్షన్లపై ఇప్పటికే రుసుములు చెల్లిస్తున్న వారంతా మళ్లీ ఈ పన్నులేమిటా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణ పన్ను 50 శాతం

ఆస్తి మూల ధన విలువ ఆధారంగా నిర్ణయించిన మొత్తం పన్నులో ఇళ్లకు సాధారణ పన్ను 50 శాతం మించకుండా విధిస్తున్నారు. మిగతా 50 శాతానికి ఇతర సేవలపై పన్నులు వేసి వసూలు చేస్తున్నారు. ఈ సాధారణేతర పన్ను పాలకవర్గం తీర్మానం మేరకు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంది. ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు కొన్ని పుర, నగరపాలక సంస్థల్లో వసూలు చేస్తున్న రుసుములు వీటికి అదనం. ఒక్కో ఇంటి నుంచి రూ.60 నుంచి రూ.120 వరకు వసూలు చేస్తున్నారు.

రుసుములపై మళ్లీ పన్నులా?

‘యూజీడీ, కుళాయి కనెక్షన్లకు ప్రజలు విధిగా రుసుములు చెల్లిస్తున్నా... మళ్లీ వాటిపై పన్నులు విధించడం దుర్మార్గం. ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి రుసుముల వసూలుకు ప్రభుత్వం అనుమతించింది. నిలిపివేసిన సేవకు ఫీజు, పన్ను చెల్లించాలా? జనరల్‌ పన్నుతోపాటు విధించే డ్రైనేజీ, నీటి, స్కావెంజింగ్‌ పన్నులను చట్టం నుంచి తొలగించాలి’

- సీహెచ్‌ బాబూరావు, ఏపీ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌

ఆస్తి పన్ను చట్ట సవరణ చేయాలి

‘ఆస్తి పన్ను తగ్గేలా చట్టంలో సవరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కుళాయి, యూజీడీ కనెక్షన్లపై ఫీజులు చెల్లిస్తున్నా మళ్లీ పన్నులు వేయడం ఏమిటి? ఇళ్ల నుంచి మూత్ర, మల విసర్జనాలు సేకరించే పనులను రద్దు చేశాకా పన్నులు ఎలా వసూలు చేస్తారు? మూల ధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించడంతో ప్రజలు ఇప్పటికే తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.’

- బీబీ గణేశ్‌, అపార్టుమెంట్ల నివాస సంక్షేమ సంఘం కన్వీనర్‌, విశాఖపట్నం

సేవలు కనుమరుగైనా పన్నులా?

‘పట్టణాల్లో పబ్లిక్‌ కుళాయిలు, ఇళ్ల నుంచి మల, మూత్ర విసర్జనాల సేకరణ వంటివి దాదాపుగా కనుమరుగయ్యాయి. అయినా నిలిపివేసిన సేవలకు ప్రజలపై పన్నులు వేయడం సరికాదు’

- ఇరిగినేని పుల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్‌, కర్నూలు

ఇదీ చూడండి..

తిరుమలలో నడకదారి భక్తుల ఇక్కట్లు.. బ్యాగులు రాక ఆందోళన

ABOUT THE AUTHOR

...view details