Pump Houses Repair : మేడిగడ్డ, అన్నారం పంపుహౌస్‌లలో 29 పంపులు, మోటార్లు ఉన్నాయి. గోదావరికి గతంలో వచ్చిన అత్యంత గరిష్ఠ నీటిమట్టానికి మించి వరద రావడంతోపాటు, భారీవర్షాల వల్ల వాగులు, వంకల ప్రవాహం వెల్లువెత్తడంతో మేడిగడ్డలోని 17, అన్నారంలోని 12 మోటార్లు నీటమునిగాయి. కాళేశ్వరం వద్ద గరిష్ఠ వరద 20 గంటలకు పైగా ఉండటంతో పంపుహౌస్‌లోకి నీరు రాకుండా చూడటానికి సిబ్బంది ప్రయత్నించారు. సీపేజీ ఉండటం, వర్షాల వల్ల పైనుంచి వచ్చిన వరద నీటితో మునిగిపోయింది. కల్వకుర్తి పంప్‌హౌస్ మునిగినప్పుడు షాఫ్ట్ దెబ్బతిని లోపలకు నీళ్లు రావడంతో మట్టి తక్కువగా ఉంది.
ఇప్పుడు కాళేశ్వరంలో పైనుంచి పంపుహౌస్‌లోకి నీళ్లు రావడంతో బురద ఎక్కువగా ఉంటుందని నీటిపారుదలశాఖ సీనియర్ ఇంజినీర్ తెలిపారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ కాగానే నీటిని తోడటంపై దృష్టి సారించనున్నారు. వరద తగ్గుముఖం పట్టాక.. పంపుహౌస్‌లో దారులు మూసేసి నీటిని బయటకు తోడతారు. తర్వాత మోటార్లను బయటకు తీసి మొదట బురద అంతా కడగాలి. తర్వాత మంచినీళ్లతో కడగటం, ఆరబెట్టడం వంటి దశలుంటాయి. అవసరమైతే కొన్ని కొత్త పరికరాలను కొనుగోలు చేయాలి. వీటన్నిటికీ సమయం పడుతుందని నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపాయి.