ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PULICHINTALA: ప్రాజెక్టు ఎంత భద్రమో సమగ్ర అధ్యయనమే మేలు - ఏపీ తాజా వార్తలు

పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా ఉన్న సమయంలో ఎలా గేటు విరిగిపోయిందన్న విషయంపై సమగ్ర అధ్యయనం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టులో మంచి పనితనం లేకుండా పోయిందని పదవీవిరమణ చేసిన సివిల్ ఇంజినీరింగ్ నిపుణులు అంటున్నారు. ఎప్పటికప్పుడు ప్యాచ్‌ పనులు చేసుకుంటూ, గేట్ల ఏర్పాటుకు అవసరమైన కాంక్రీటు మళ్లీ నింపుతూ ప్రాజెక్టు పనులు పూర్తి చేశారనేది అందరు ఇంజినీర్ల మాట.

pulichintala
pulichintala

By

Published : Aug 7, 2021, 6:47 AM IST

పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా ఉన్నప్పుడు గేటు విరిగిపోయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు భద్రతపై సమగ్ర అధ్యయనం నిర్వహిస్తే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో మంచి పనితనం లేకుండా పోయిందని ప్రభుత్వంలో పనిచేసి పదవీవిరమణ చేసిన సివిల్‌ ఇంజినీరింగ్‌ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ప్యాచ్‌ పనులు చేసుకుంటూ, గేట్ల ఏర్పాటుకు అవసరమైన కాంక్రీటు మళ్లీ నింపుతూ ప్రాజెక్టు పనులు పూర్తి చేశారనేది అందరు ఇంజినీర్ల మాట. ప్రస్తుత ఘటనలో మెకానికల్‌ అంశాలే కీలకం అవుతున్నాయి.

ప్రాథమిక అంచనా ప్రకారం గేటుకు ట్రునియన్‌ పిన్‌ గుండెకాయ లాంటిదని.. టై ఫ్లాట్‌ విరిగిపోవడమే ఈ ప్రమాదానికి నేపథ్యమని చెబుతున్నారు. మొదట తలుపు ఎడమవైపున టై ఫ్లాట్‌ విరిగిపోయి, కుడి వైపునకు తలుపు మళ్లిపోయింది. ట్రునియన్‌ బీమ్‌ పూర్తిగా తెగిపోయింది. దీనివల్ల పియర్‌లో కొంత కాంక్రీటు భాగమూ దెబ్బతింది. మెకానికల్‌ విభాగంలో బాగా అనుభవమున్న విశ్రాంత డీఈ సత్యనారాయణను పిలిపిస్తున్నారు. ప్రాథమికంగా ఈ ఘటనపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటవుతోంది. జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఛైర్మన్‌గా, సీఈ సీడీవో కె.శ్రీనివాస్‌, విశ్రాంత సీఈ గిరిధర్‌రెడ్డి, విశ్రాంత మెకానికల్‌ ఇంజినీరు సత్యనారాయణ సభ్యులుగా ప్రాజెక్టు ఎస్‌ఈ కన్వీనర్‌గా ఈ కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

అత్యున్నత సంస్థకు అప్పగిస్తే మేలు

ఇంతకుముందు కూడా డ్యాం భద్రతా నిపుణులు పులిచింతల ప్రాజెక్టును పరిశీలించి నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికల ప్రకారం ఇంకా పూర్తిస్థాయి పనులు చేపట్టిన దాఖలాలు లేవన్న విమర్శ ఉంది. 2015లో డ్యాం భద్రతా కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా పనులు చేయలేదంటున్నారు. కరోనా కారణంగా నిరుడు డ్యాం భద్రతా తనిఖీలు జరగలేదని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో ట్రునియన్‌ బ్లాకుల పరిశీలన చేపట్టాలని డ్యాం డిజైన్‌ కమిటీ సూచించింది. చెన్నైకి చెందిన ఒక ప్రముఖ సంస్థతో ఆ పరిశీలన చేయిస్తున్నారు.

ఇలా పులిచింతల విషయంలోనూ అత్యున్నత సంస్థతో పూర్తి భద్రతపై అధ్యయనం చేయించడం మేలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. పోలవరంలో చిన్న పనికే రూ.లక్షల వ్యయమవుతోందని, అదే పులిచింతల మొత్తం భద్రతపై అధ్యయనం చేయాలంటే పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుందని, చాలా సమయమూ పడుతుందని పేర్కొంటున్నారు. తొలుత నిపుణుల కమిటీ ప్రాథమిక పరిశీలన తర్వాత సమగ్ర అధ్యయనంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఇంకా ఏమంటున్నారంటే..

*ప్రతి సంవత్సరం డ్యాం నిర్వహణ తనిఖీలు చేస్తే సమస్యలు ముందే గుర్తించే అవకాశం ఉంటుంది. అది జరగకపోవడమూ సమస్యకు కారణం.
* ఎప్పటికప్పుడు గేట్ల నిర్వహణపై దృష్టి సారించాలి.
* పులిచింతలలో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లేదు. ఈ ప్రాజెక్టులో నీరు నిలబెట్టిన తర్వాత కూడా గ్రౌటింగు సరిగా చేయకపోవడం వల్ల లీకేజీలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌స్ట్రుమెంటేషన్‌ వల్ల ఎంత ఒత్తిడి ఉంది, డ్యాం ఊగుతోందా, డ్యాంలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా అన్నవి నమోదవుతాయని చెబుతున్నారు.
* ట్రునియన్‌ నిర్వహణ సరిగా లేకున్నా అవి తుప్పు పట్టి పాడవుతాయని ఒక విశ్రాంత సీఈ పేర్కొన్నారు. వాటిని కూడా సరి చూసుకోవాలి.

ఇదీ చదవండి: tdp pulichintala tour: 'జలయజ్ఞంలో ధనయజ్ఞం వల్లే పులిచింతల గేటు కొట్టుకుపోయింది'

ABOUT THE AUTHOR

...view details