Pubs in Hyderabad : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, మాదాపూర్, గచ్చిబౌలి.. తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో పబ్‌లున్నాయి. వీటిల్లో బంజారాహిల్స్ రాడిసన్ లాంటి స్టార్‌హోటళ్లలోని పబ్‌లలో 24 గంటలూ మద్యం సరఫరాకు అనుమతి ఉంది. మిగిలిన వాటిని రాత్రి 12 గంటలకు మూసేయాలి. వారాంతాల్లో మాత్రం రాత్రి 1గంట వరకు అనుమతిస్తారు. చట్టం ప్రకారం పబ్‌లలో శబ్దం 45 డెసిబుల్స్‌కంటే మించరాదు. జనావాస ప్రాంతాల్లోని వాటిలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్దాలే ఉండకూడదనే నిబంధన ఉంది. చాలా పబ్‌లలో ఇవేమీ అమలుకావడం లేదు. తెల్లవార్లూ డీజేలతో చుట్టుపక్కల ప్రాంతాలు దద్దరిల్లేలా హోరెత్తిస్తున్నారని, దీంతో రాత్రివేళల్లో నిద్ర కరవవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పార్కింగ్ సదుపాయం లేకున్నా : కొన్ని పబ్‌లకు తగినంత పార్కింగ్ సదుపాయం లేదు. దీంతో అక్కడికి వచ్చేవారు పరిసరాల్లోని ఇళ్ల ముందే వాహనాలు నిలిపేస్తున్నారు. ‘అర్ధరాత్రి తర్వాత తిరిగి వచ్చే కొందరు కార్ల వద్దే తాగి మద్యం సీసాలు, సిగరెట్ పీకలు, ఖాళీ మత్తుపొట్లాలు అక్కడే వదిలేస్తున్నారు. కొందరైతే మత్తు ఎక్కువై అక్కడే పడిదొర్లడం, వాంతులు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. రోజూ శుభ్రం చేయించుకోలేక అల్లాడుతున్నాం. గేట్ల ముందు కార్లు నిలపడంతో ఒక్కోసారి అత్యవసరమైతే ఇళ్లలోని కార్లు బయటకు తీయలేకపోతున్నామని’ స్థానికులు వాపోతున్నారు.