ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీ.. మెట్రో.. ఎంఎంటీఎస్‌.. సమన్వయం అడగొద్దు! - no Coordination between Hyderabad metro rtc and mmts

హైదరాబాద్ భాగ్యనగరంలో కొవిడ్‌కు ముందు వరకు నిత్యం అన్ని రకాల ప్రజారవాణా వ్యవస్థపై ఆధారపడ్డ ప్రయాణికులు ఎంతమందో తెలుసా.. అచ్చంగా 39.30 లక్షలు. పరిస్థితులు కొలిక్కి వస్తుండటంతో మళ్లీ నగర రహదారులన్నీ గత కొన్నాళ్లుగా కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ-మెట్రో, ఎంఎంటీఎస్‌ సేవల మధ్య సమన్వయం లేక వీరంతా ఇబ్బందులు పడుతున్నారు.

metro-rtc
metro-rtc

By

Published : Feb 4, 2021, 9:04 AM IST

హైదరాబాద్ భాగ్యనగరంలో ఒక రవాణా వ్యవస్థ నుంచి మరోదానికి మారాలంటే సగటు ప్రయాణికుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మెట్రో రైల్వే స్టేషన్‌ వరకూ జనాలను తీసుకువచ్చే వ్యవస్థ లేదు. అంతెందుకు మెట్రో మార్గంలో ప్రయాణించే బస్సులు కూడా ఆ స్టేషన్ల దగ్గర ఆగేలా స్టాపులు లేవు. ఇక ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లలో దిగితే.. ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉండదు. ఈ పరిస్థితి వల్లే అనేకమంది సొంత వాహనాలను వినియోగిస్తున్నారు. వెరసి ట్రాఫిక్‌ జాంలు, కాలుష్యమే కాక ఇంధన వ్యయంతో జేబుకూ చిల్లు పడుతోంది.

అనుసంధానమే పరిష్కారం..

కాలనీల నుంచి మెట్రో స్టేషన్లకు కనీసం 200 మినీ బస్సులను నడిపి ఆయా ప్రాంతాలకు అనుసంధానం చేయాలనుకున్నారు. నాలుగేళ్లయినా ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. నగరంలో మొత్తం 26 ఎంఎంటీఎస్‌ స్టేషన్లుండగా.. ఇందులో ఆరింటికే బస్సు సౌకర్యం ఉంది. లింగంపల్లి-హైదరాబాద్‌, లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య తిరిగే ఎంఎంటీఎస్‌లు ప్రతి 15 నిమిషాలకొకటి హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌కు వస్తాయి. ఈ స్టేషన్లో ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే ఒక్కో బండి నుంచి 1,200-1,500 మంది ప్రయాణికులు దిగుతారు. వీరిని మాదాపూర్‌, గచ్చిబౌలి ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్‌కు తీసుకెళ్లేందుకు..సాయంత్రం మళ్లీ తీసుకొచ్చేందుకు కనీసం 100 బస్సులు అందుబాటులో ఉండాలి. ఈ బస్సులే రాయదుర్గం మెట్రో స్టేషన్లో దిగే ప్రయాణికులను కూడా తీసుకువెళ్తే మరింత సౌలభ్యం.. కరోనాకు ముందు అక్కడ నడిచే బస్సుల సంఖ్య 25కి మించి లేవు. దీంతో ప్రైవేటు వాహనాల జోరు పెరిగింది. ఇక అన్ని మెట్రో స్టేషన్లలో బస్‌బేలు నిర్మించాల్సి ఉంది.

ట్రాఫిక్‌ రద్దీ మళ్లీ..

నగరంలో దాదాపు 60 లక్షల వాహనాలున్నాయి. ఇందులో రోజూ 40 లక్షల వరకు రోడ్డెక్కుతున్నాయి. ఇంటి నుంచి పని కాకుండా అన్ని కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేస్తే ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, పంజాగుట్ట, బేగంపేట మీదుగా సికింద్రాబాద్‌ మార్గం విపరీతమైన ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి ఎదురవుతోంది.

కొవిడ్‌కు ముందు ఇలా..

1.80 లక్షలు.. ఎంఎంటీఎస్‌ రైళ్లలో తిరిగేవారు

33 లక్షలు.. నిత్యం ఆర్టీసీ సిటీ బస్సులలో ప్రయాణించేవారు

4.50 లక్షలు.. మెట్రో రైళ్లను ఆశ్రయించేవారు

ABOUT THE AUTHOR

...view details