రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే రూ.50వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లడంతో పాటు.. రైతులు తీవ్రంగా నష్టపోతారని, అందువల్ల తరలింపు ఆలోచనను మానుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హితవు పలికారు. రాజధాని మార్పు యోచనకు సరైన కారణం చూపించడంలో విఫలమైన వైకాపా ప్రభుత్వం.. అమరావతి ముంపు ప్రాంతమని చెబుతోందని, ఈ ప్రాంతానికి ముంపు సమస్య లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్ చెప్పినా, దానిని సుప్రీంకోర్టు సమర్థించినా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి అమరావతి అనువైనది కాదని ఐఐటీ మద్రాస్ చెప్పినట్లు మరో కట్టుకథ అల్లారని.. కానీ స్వయంగా ఐఐటీ మద్రాస్‌వాళ్లే దానిని ఖండించారని గుర్తు చేశారు. అమరావతి విషయంలో తనకు స్వార్థ ప్రయోజనాలు ఏమీ లేవని, రాష్ట్రానికి నష్టం వాటిల్లకుండా చూసేందుకే తమ పార్టీ పోరాడుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంతవరకు కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండకపోతే పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయి భవిష్యత్తులో పెట్టుబడులకు ముందుకు రారన్నారు. రాజధాని అంశంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సభలో 3 రాజధానుల బిల్లును అడ్డుకోడానికి తగిన వ్యూహం సిద్ధం చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. అసెంబ్లీలో అధికార పక్షానికి ఆధిక్యం ఉంటే, మండలిలో తమకు ఉందని, ఇక ఏం జరుగుతుందో చూడాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంలో ఎలాంటి అక్రమాలు లేవు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనల మేరకే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాం. రాష్ట్రానికి సరిగ్గా మధ్యలో ఉండటం, అన్ని రకాలుగా బాగుండటంవల్లే ఎంచుకున్నాం. పైగా, అమరావతి ఎంపిక అనేది ముగిసిన అధ్యాయం. ఒకవేళ అందులో ఏమైనా అక్రమాలుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు సరికదా.. అనవసరంగా మాపై బురదజల్లుతోంది. 5కోట్ల మంది ఆంధ్రుల ప్రయోజనాలు తప్ప.. అమరావతి విషయంలో నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలూ లేవు. రాజకీయవేత్తగా నాకున్నది ఒక్కటే ప్రయోజనం.. అది రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి. సంయుక్త ఆంధ్రప్రదేశ్ కోసం నేను విజన్-2020 రూపొందించా. దాని ఫలితాలు హైదరాబాద్‌లో చూస్తున్నారు. నవ్యాంధ్రకు నేను విజన్ 2029-2050 సిద్ధం చేశా. దాని ప్రకారం 2029 నాటికి తలసరి ఆదాయం, వృద్ధిరేటు.. ఇలా అన్ని అంశాల్లో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలవాలి. కానీ, ఇప్పుడీ మనిషి (జగన్‌మోహన్‌రెడ్డి) ఆ ఆశలపై నీళ్లుచల్లారు.
- ఇప్పటికే దాదాపు పూర్తి కావొస్తున్న నిర్మాణాలతో కూడిన రాజధానిని తరలించడంలో ఏమైనా అర్థముందా? రూ.50వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 50వేల ఉద్యోగాలు రావాల్సి ఉంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు.. ఇలాంటివి 130 రావాలి. రాజధానిని మారిస్తే ఇవేవీ రావు. అమరావతి అభివృద్ధికి ఇప్పటికే రూ.10వేల కోట్లు ఖర్చు చేశాం. సచివాలయం, శాసనసభ, కోర్టులు, రాజ్‌భవన్, డీజీపీ కార్యాలయ నిర్మాణాలు పూర్తయ్యాయి. మంత్రులు, సీనియర్ అధికారుల కోసం 5వేల నివాస భవనాల నిర్మాణం కొనసాగుతోంది. మరో రూ.2,000-3,000 కోట్లు ఖర్చుపెడితే అన్నీ సిద్ధమయ్యేవి.
- ప్రపంచంలో చాలా దేశాలు ముఖ్యమైన కార్యాలయాలన్నీ ఒక్కచోటే ఉండేలా చూసుకుంటున్నాయి. దేశ రాజధాని దిల్లీలోనూ అన్నింటినీ ఒకచోటుకు తెస్తున్నారు. మెరుగైన పాలన కోసం 5 టవర్లలో అన్ని శాఖల కార్యాలయాలూ ఉండేలా అమరావతిని తీర్చిదిద్దాలనుకున్నాం. ఇప్పుడు పరిస్థితి అంతా ఐదు కోట్లమంది ఆంధ్రులతో జగన్ ప్రభుత్వ పోరులా ఉంది. ఎనిమిది నెలల్లో ప్రజల మనస్సు మారింది. ఈ ప్రభుత్వం తీరు చూసి ప్రతి ఒక్కరూ విసుగెత్తిపోయారు. రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలి.
ఐదు కోట్ల మంది ఆంధ్రుల ప్రయోజనాలు తప్ప.. అమరావతి విషయంలో నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలూ లేవు. రాజకీయవేత్తగా నాకున్నది ఒక్కటే ప్రయోజనం.. అది రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి. రాజధాని మారిస్తే ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించిన భూములు వ్యవసాయానికి పనికిరావు. దాంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. వినూత్నమైన ‘ల్యాండ్‌పూలింగ్ పథకం’ కింద రైతులు రాజధాని కోసం 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇప్పుడు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ వాళ్లంతా ఉద్యమిస్తున్నారు. రాజధాని మారిస్తే వాళ్లందరికీ నష్టపరిహారం కింద దాదాపు రూ.1-4 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. - చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చూడండిఅక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలి:చంద్రబాబు