ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బాపూజీ స్ఫూర్తితో పూర్తిస్థాయి రాజధానిని సాధిస్తాం' - రాజధాని రైతుల ఆందోళనల తాజా వార్తలు

మహాత్మా గాంధీజీ సాధించిన స్వాతంత్ర్య పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోని అమరావతిని రాజధానిగా సాధిస్తామని రైతులు స్పష్టం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా.. రాజధాని గ్రామాల్లో రైతుల పోరు నినాదాలు ఆకాశాన్నంటాయి. ఆనాడు క్విట్ ఇండియా నినాదాంతో బ్రిటీష్ వారిని తరిమేశారని.. ఇపుడు జై అమరావతి నినాదంతో పాలకుల మనస్సులో నెలకొన్న మూడు రాజధానుల తలంపును పారదోలుతామని రైతులు, మహిళలు తేల్చిచెప్పారు.

Amaravati
Amaravati

By

Published : Oct 2, 2020, 8:18 PM IST

బాపూజీ స్ఫూర్తి బాట రాజధాని పోరుబాట.. పేరుతో రైతులు 29 గ్రామాల్లో నిరాహారాదీక్షలు నిర్వహించారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని రాజధాని గ్రామాల్లో రైతులు నిరాహారా దీక్షలు చేశారు. వెలగపూడి, తుళ్లూరులో భారతీయత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గాంధీజీ ఛాయా చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. గాంధీ స్ఫూర్తితో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. వెలగపూడిలో రైతుల దీక్షను రాజధాని పరిరక్షణ సమితి నాయకులు ప్రారంభించారు.

కృష్ణా జిల్లా జడ్పీ మాజీఛైర్ పర్సన్ అనురాధ.. మందడంలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించారు. రైతులకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. కృష్ణాయపాలెంలో రైతులు, చిన్నారులు జాతిపిత చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. బోరుపాలెంలో చిన్నారులు సైతం దీక్షలో పాల్గొని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

ఉద్ధండరాయునిపాలెంలో రైతులు మోకాళ్లపై నిల్చోని గాంధీ మహాత్ముడికి నివాళులర్పించారు. రాజధాని ఉద్యమానికి నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్​ల గ్రామ పర్యటన నేపథ్యంలో రైతులు ఏర్పాటు చేసుకున్న మైక్​ను తొలగించాలంటూ పోలీసులు రైతులకు హుకుం జారీచేశారు. ఈ ఘటనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. నల్ల జెండాలతో వైకాపా ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళితులకు కౌలు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

తమ సమస్యల పరిష్కారం కోసం శాసనసభ్యురాలికి వినతిపత్రం ఇస్తామంటూ రైతులు పోలీసులను కోరగా నిరాకరించారు. రైతుల నినాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇద్దర్ని తీసుకెళ్తామంటూ పోలీసులు చెప్పడంతో రైతులు శాంతించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవికి వినతి పత్రం ఇచ్చారు. గాంధీజీ స్ఫూర్తితో శుక్రవారం నుంచి తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా నిర్వహిస్తామని రైతులు, ఐకాస నేతలు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

'మా పార్టీకి సిద్ధాంతాలున్నాయి.. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details