రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 450వ రోజు ఆందోళన కొసాగించారు. గుంటూరులోని తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, నీరుకొండ, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం, పెదపరిమి, ఉద్ధండరాయునిపాలెంలో దీక్షలు కొనసాగించారు.
450వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలు 450వ రోజుకు చేరాయి. ఆందోళన నిర్వహిస్తున్న పలు గ్రామాల్లో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అబ్బరాజుపాలెంలో పోలేరమ్మకు పొంగళ్లు సమర్పించారు. కృష్ణాయపాలెంలో శివున్ని అలంకరించి ఊరేగించారు. జై అమరావతి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ చేపట్టారు. తుళ్లూరులో శివనామ సంకీర్తనలు ఆలపించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికిన తెలంగాణ మంత్రి కేటీఆర్....అమరావతి పోరాటానికి తన సంఘీభావం ప్రకటించాలని కోరారు. అమరావతి శంకుస్థాపనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారని రైతులు గుర్తు చేశారు.
ఇదీ చదవండి:కొమ్మూరు అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు