* కొవిడ్ నుంచి రానున్న రోజుల్లో ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఏంటి?
ఈ ఏడాదంతా ఏం జరుగుతుందో అంచనా వేయడం ప్రస్తుతం కష్టం. కేసుల పరంగా చూస్తే మనం మూడోవేవ్‌లో ఉన్నాం. గతంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వచ్చిన కేసుల సంఖ్య కన్నా చాలా ఎక్కువగా వస్తున్నాయి. జనాభా, వ్యాక్సినేషన్‌పైన దీని ప్రభావం ఆధారపడి ఉంది. రెండు నుంచి నాలుగు వారాల్లో ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జనవరి ఆఖరులో లేదా ఫిబ్రవరి ఆరంభంలో గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదవుతాయని నమూనాలు (మోడల్స్) అంచనా వేస్తున్నాయి.
* ఒమిక్రాన్‌కు దారితీసిన పరిస్థితులేంటి? ఇది ఎంత ప్రమాదకరమైంది?
ఒమిక్రాన్ ఎలా వచ్చిందన్నదానిపై పలు సిద్ధాంతాలున్నాయి. ప్రపంచంలో పర్యవేక్షణ, నిఘా చాలా తక్కువగా ఉన్నచోట్ల వైరస్ విస్తరించి ఒమిక్రాన్‌కు దారి తీసింది. మెరుగైన ప్రయోగశాలలు ఉన్నా దక్షిణాఫ్రికాలో దీనిని చూసే వరకు గుర్తించలేకపోయాం. రెండోది వైరస్ మనుషుల నుంచి జంతువులకు వెళ్లిన చోట ఏర్పడి తిరిగి (రివర్స్ జూనోసిస్) మనుషుల్లోకి వచ్చింది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వ్యక్తికి వైరస్ సోకి తదుపరి విస్తరించేవరకు మ్యుటేషన్ జరిగిందనేది ఇంకొకటి.. ఇలా మూడు కారణాలున్నాయి. ఒమిక్రాన్‌ను నిరోధించడానికి ఇదివరకటి జాగ్రత్తలే మళ్లీ పాటించాలి.
ప్రజలంతా వ్యాక్సిన్ వేసుకొనేలా చూడటం..డేటాపైన, ఇందుకు సంబంధించిన వ్యవస్థలపైన పెట్టుబడులు పెట్టడం.. అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం, వారితో డేటా పంచుకోవడం.. రోగ నిర్థారణ కేంద్రాలు, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడటం ప్రధానం. మాస్కులు పెట్టుకోవడం, ఎక్కువ మంది గుమిగూడకుండా చూడటం, వ్యాక్సిన్లు తీసుకోనివారంతా తీసుకోవడంతో పాటు మాస్కులను అప్‌గ్రేడ్ చేయడం గురించి కూడా ఆలోచించాలి. తక్కువ రిస్క్ ఉన్న చోట గుడ్డ మాస్కులు కాకుండా సర్జికల్ మాస్కులు, ఎక్కువ రిస్కు ఉన్న చోట ఎన్-95 మాస్కులు వినియోగించాలి.
* కొన్ని అధ్యయనాల ప్రకారం ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది కానీ , దీని బారిన పడిన వారు ఎక్కువ ప్రమాదంలోకి వెళ్లరని అంటున్నారు. ఇది మంచి సంకేతంగా భావించవచ్చా?
ఇది వాస్తవమే అయినా ఎక్కువమందికి సోకినప్పుడు ఆసుపత్రిలో చేరేవారి సంఖ్యా పెరుగుతుంది. ఉదాహరణకు ఒక వైరస్ రోజుకు వెయ్యి ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుందనుకొంటే, ఇందులో పదిశాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రావొచ్చు. అంటే రోజుకు 100 మందికి ఆసుపత్రి అవసరమవుతుంది. అయితే ఇంకో వైరస్ రోజుకు ఐదువేల ఇన్‌ఫెక్షన్లకు కారణమైతే ఐదు శాతం మందికే ఆసుపత్రి అవసరమవుతుంది. కానీ సంఖ్యాపరంగా చూసినపుడు ఇది 250. ఈ సంఖ్యే ఎక్కువ. ఒమిక్రాన్ కూడా ఇంతే.
* కేంద్రం బూస్టర్‌డోస్‌కు అనుమతించింది. మూడోడోస్‌గా ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి? బూస్టర్‌డోస్ ఒమిక్రాన్ నుంచి రక్షణ ఇస్తుందా?
ప్రస్తుతానికి గతంలో తీసుకున్న టీకానే బూస్టర్‌డోస్‌గా తీసుకోవాలని కేంద్రం సూచించింది.కానీ ప్రపంచంలోని ఇతర దేశాల డేటా ప్రకారం వేర్వేరు వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. భారతదేశం నుంచి కూడా త్వరలోనే డేటా వస్తుందని, వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకునే విషయాన్ని పరిగణనలోకి తీసుకొంటారని ఆశిస్తున్నా. ఇతర దేశాల్లోని డేటా ప్రకారం బూస్టర్ల వల్ల ఒమిక్రాన్ నుంచి మెరుగైన రక్షణ ఉందని చెప్తున్నాయి.