ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లీజుకు క్వార్టర్లు.. ఏటా రూ.10 కోట్ల ఆదాయం అంచనా..

Employees buildings lease in amaravati: అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్యోగుల కోసం నిర్మించిన గ్రూప్ డి భవనాలను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌డీఏ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. విట్ యునివర్సిటీకి ఒక భవనాన్ని లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఏడాదికి 8నుంచి 10కోట్ల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది.

employees buildings lease in amaravati
employees buildings lease in amaravati

By

Published : Jun 27, 2022, 3:37 AM IST

Employees buildings lease in amaravati: రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు వీల్లేదని మార్చి 3న హైకోర్టు విస్పష్టంగా తీర్పు చెప్పినా ప్రభుత్వ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసం కోసం రాజధానిలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ టవర్లను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వాలని తాజాగా నిర్ణయించింది. నిధుల సమీకరణకు రాజధానిలో భూములు విక్రయించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. రాజధానిలో నాలుగో తరగతి (గ్రూప్‌-డి) ఉద్యోగుల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్‌ టవర్లలో ఒకటి విట్‌ యూనివర్సిటీకి లీజుకివ్వాలని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. ఒక టవర్‌తో మొదలుపెట్టి దశలవారీగా అన్ని టవర్లను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు రాజధానిని ఇక్కడే కొనసాగించాలన్న ఆలోచనే ఉంటే, ఉద్యోగుల కోసం నిర్మించిన టవర్లను ప్రైవేటు సంస్థలకు ఎందుకు లీజుకిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజధానిలో పనులు జరుగుతున్నట్లుగా భ్రమ కలిగించేందుకు అరకొర పనులు చేస్తూ, కోర్టులో అఫిడవిట్లు వేస్తూ నెట్టుకొస్తున్న ప్రభుత్వ అసలు ఉద్దేశం ఈ చర్యతో బట్టబయలైందని అమరావతి రైతులు, ప్రజలు మండిపడుతున్నారు.

అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు (ఏఐఎస్‌) అధికారులు మొదలు నాలుగో తరగతి (గ్రూప్‌-డి) ఉద్యోగుల వరకు.. వారు నివసించేందుకు గత ప్రభుత్వ హయాంలో సీఆర్‌డీఏ పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్‌ టవర్ల నిర్మాణం ప్రారంభించింది. వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉండగానే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పనులు ఎక్కడికక్కడే నిలిపివేసింది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్‌ టవర్లలో పెండింగ్‌ పనుల్ని ప్రారంభించింది. అవి పూర్తవడానికి మరో అయిదారు నెలలు పడుతుందని సమాచారం. గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం తలపెట్టిన అపార్ట్‌మెంట్‌ టవర్లలో పెండింగ్‌ పనుల్ని ఇంకా ప్రారంభించలేదు. వాటిలో గ్రూప్‌-డి ఉద్యోగుల కోసం నిర్మించిన ఆరు టవర్లలో డి-1 టవర్‌ను విట్‌ యూనివర్సిటీకి లీజుకిచ్చేందుకు సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఇటీవల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కూడా ఆమోదముద్ర వేసినట్టు తెలిసింది. నెల రోజుల క్రితం విట్‌ యూనివర్సిటీ ప్రతినిధులు వచ్చి ఆ టవర్లను పరిశీలించి వెళ్లినట్టు సమాచారం.

సంవత్సరానికి రూ.10 కోట్ల లీజు?
గ్రూప్‌-డి ఉద్యోగుల కోసం 7.76 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం ఆరు టవర్లను సీఆర్‌డీఏ నిర్మించింది. ఒక్కోదానిలో 120 చొప్పున మొత్తం 720 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 900 చ.అడుగులు. కామన్‌ ఏరియాతో కలిపి ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం 1,420 చ.అడుగులు, మొత్తం టవర్‌లో నిర్మిత ప్రాంతం 1,70,400 చ.అడుగులని ఇటీవల ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో సీఆర్‌డీఏ పేర్కొంది. ఆ టవర్‌ మొత్తాన్ని లీజుకు ఇచ్చేందుకు విట్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వస్తే సంవత్సరానికి లీజు రూపంలో రూ.8-10 కోట్లు వస్తుందని తెలిపింది. రాజధానిలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ టవర్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌ అధికారుల భవనాల తర్వాత, ఎక్కువ శాతం పని పూర్తయినవి గ్రూప్‌-డి ఉద్యోగుల టవర్లే. కొద్దిపాటి పనులు పూర్తి చేస్తే అవి సిద్ధమైపోతాయని, అందుకే వాటిని లీజుకివ్వాలని సీఆర్‌డీఏ నిర్ణయించిందని సమాచారం. భవిష్యత్తులో మిగతా టవర్లను లీజుకు తీసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే ఇచ్చేసే యోచనలో సీఆర్‌డీఏ ఉన్నట్టు సమాచారం.

లీజులకిచ్చేస్తే రాజధాని ఎలా అవుతుంది?
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు విస్పష్టంగా తీర్పు చెప్పింది. అమరావతి నిర్మాణానికి, రాజధానికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన స్థలాలు అభివృద్ధి చేసి ఇచ్చేందుకు సీఆర్‌డీఏకి నిర్దిష్ట గడువు విధించింది. ప్రభుత్వం మాత్రం రాజధాని పనులు చేపట్టకుండా ఎలా కాలయాపన చేయాలా అని చూస్తోంది. ఇప్పుడు ఏకంగా.. అక్కడ ఉద్యోగుల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్లను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చేయాలని నిర్ణయించింది. రాజధానిలో ప్రభుత్వ అవసరాలు, ఉద్యోగుల నివాసాల కోసం నిర్మించిన భవనాల్ని లీజుకిచ్చేస్తే అది రాజధాని ఎలా అవుతుందని రాజధాని పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య హైకోర్టు తీర్పునకు విరుద్ధమని మండిపడుతున్నారు.

మొత్తం 53 టవర్లు
రాజధానిలోని పరిపాలన నగరంలో 5 చోట్ల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 62.3 ఎకరాల్లో 53 టవర్ల నిర్మాణాన్ని సీఆర్‌డీఏ ప్రారంభించింది. అవన్నీ పూర్తయితే మొత్తం 3,888 ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు కొనసాగించి ఉంటే.. అవన్నీ చాన్నాళ్ల క్రితమే పూర్తయి ఉద్యోగులకు అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడు వాటిని సీఆర్‌డీఏ పూర్తి చేసినా, ఉద్యోగులకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం లేనట్లు తాజా పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. త్వరలో పూర్తిస్థాయిలో సిద్ధం కానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌ అధికారుల టవర్లను ప్రభుత్వం ఏం చేయనుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు.

304.5 ఎకరాల విక్రయం వచ్చే నెలలో..
రాజధానిలో గతంలో బి.ఆర్‌.శెట్టి మెడిసిటీ ప్రాజెక్టుకు కేటాయించిన 100.02 ఎకరాల్ని, ఇండో-యూకే ఇనిస్టిట్యూట్‌కు కేటాయించిన 148.28 ఎకరాల్ని జులై నాలుగో వారంలో ఈ-వేలం ద్వారా విక్రయించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. నవులూరులోని అమరావతి టౌన్‌షిప్‌లో 37.48 ఎకరాల్ని ఈ-వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొంది. నవులూరులోని అమరావతి టౌన్‌షిప్‌లోనే మరో 8.03 ఎకరాలు, తెనాలి చెంచుపేటలోని ఐడీఎస్‌ఎంటీకి చెందిన 2.81 ఎకరాలు, విజయవాడ పాయకాపురం టౌన్‌షిప్‌లోని 7.01 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలోని ట్రక్‌ టెర్మినల్‌కు చెందిన 0.87 ఎకరాల్ని జులై రెండోవారంలో ఈ-వేలం ద్వారా విక్రయించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. వీటి విక్రయానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఈ నెల 6న జీవో (నం.390) జారీ చేసినట్లు ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details