రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నివాస, నివాసేతర ఇళ్లు, భవనాలకు ఆస్తి పన్ను విధిస్తూ ఈనెల 10లోగా పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో జాబితాలు సిద్ధం చేయనున్నారు. వివిధ దశల అనంతరం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ప్రక్రియ పూర్తి చేసి ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్నుల విధానం అమలు చేయాలని పురపాలకశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాత్కాలిక షెడ్యూల్‌ని పురపాలకశాఖ కమిషనర్ విజయకుమార్ అన్ని పుర, నగరపాలక సంస్థలకు మంగళవారం పంపారు.
డిసెంబరు 10: వార్షిక అద్దె విలువ (ఏఆర్‌వీ) ఆధారంగా ఇప్పుడున్న పన్నులను రిజిస్ట్రేషన్ విలువ విధానంలోకి మార్చుతూ అసెస్‌మెంట్ల వారీగా రికార్డులు సిద్ధం చేయాలి.
డిసెంబరు 15: రిజిస్ట్రేషన్ విలువ విధానంలోకి మార్చిన తరవాత మొత్తం పన్నులో ఎంత శాతం విధించాలో నిర్ణయిస్తూ పాలకవర్గంతో తీర్మానం చేయించాలి. పుర, నగరపాలక సంస్థల్లో పాలకవర్గాలు లేనందున ప్రత్యేక అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
డిసెంబరు 25: పాలకవర్గ తీర్మానంపై పన్నుల ముసాయిదా రూపొందించి ఆస్తిపన్ను మండలికి పంపాలి.
డిసెంబరు 30: ముసాయిదాపై ఆస్తి పన్ను మండలి పరిశీలించి అనుమతి తెలియజేయాలి.
జనవరి 3: పన్ను ముసాయిదాపై నోటిఫికేషన్ జారీచేసి ప్రజలందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలి.
ఫిబ్రవరి 2: ముసాయిదాపై వచ్చే అభ్యంతరాలు స్వీకరించాలి.
ఫిబ్రవరి 9: ప్రజల అభ్యంతరాలపై ముసాయిదాలో మార్పులు, చేర్పులు చేస్తూ మరోసారి పాలకవర్గ ఆమోదం పొందాలి
ఫిబ్రవరి 19: పాలకవర్గ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి..మరోసారి చర్చించి తదుపరి అనుమతి తీసుకోవాలి.
ఫిబ్రవరి 28: రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ణయించిన పన్నులపై తుది నోటిఫికేషన్ జారీ చేసి జిల్లా గెజిట్‌లో చేర్చాలి.
మార్చి 31: దస్త్రాలను డిజిటలైజ్ చేయాలి.