ఆస్తి పన్ను చట్టానికి సవరణ చేస్తూ పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తి పన్నును రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ధరణ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏడాది అద్దె విలువ (యాన్యువల్ రెంటల్ వ్యాల్యు) ప్రాతిపదికన ఆస్తి పన్నును ప్రభుత్వం లెక్కిస్తోంది. కొత్త విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన ప్రతీసారి ఆ మేరకు ఆస్తిపన్ను పెరగనుంది. ఏడాది అద్దె విలువ ప్రాతిపదికన లెక్కించే పన్ను మొత్తం కంటే రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా గణించే పన్ను.. పదిశాతం కంటే ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆస్తి పన్ను మోత... ఇకపై రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా వసూలు - ఏపీలో రిజిస్ట్రేషన్ విలువ ఆదారంగా ఆస్తి పన్ను
2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను నిర్ధరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆస్తి పన్ను చట్టానికి సవరణ చేస్తూ పురపాలకశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన ప్రతీసారి ఆస్తిపన్ను పెరగనుంది.
ధార్మిక, విద్య, వైద్యం, స్మారక, సంస్కృతిక కట్టడాలకు ఆస్తిపన్ను మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. సైనికులు, మాజీ సైనికుల గృహాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. 375 చదరపు అడుగులకు లోపున్న భవనాలకు వార్షిక ఆస్తిపన్నుగా రూ.50 నిర్ధరించారు. అయితే ఈ భవనాల్లో యజమాని మాత్రమే నివసించాల్సి ఉంటుందని పురపాలక శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆస్తి విలువ ఖరారు చేసేందుకు భవనాలను నిర్మాణ శైలి ఆధారంగా వర్గీకరణ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆర్సీసీ, పెంకులు, రేకులు, నాపరాళ్లు, పూరిళ్ల వర్గీకరణ ఆధారంగా ఆస్తిపన్ను విధింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఆస్తి పన్ను నిర్ధరణలో అక్రమకట్టడాలకు ఉల్లంఘనలను అనుసరించి 25 నుంచి 100 శాతం వరకూ జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది.
ఇదీ చదవండి :అనంతపురంలో ఉద్రిక్తత... పోలీసుల అదుపులో జేసీ పవన్