ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనుమతుల కోసం ఎదురుచూపు.. గోదావరిపై ప్రాజెక్టులకు మోక్షమెప్పుడు

Projects awaiting approval: అనుమతుల కోసం గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే డీపీఆర్​లను సమర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ప్రక్రియ పూర్తి కోసం ప్రయత్నిస్తోంది. కీలకమైన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్కసాగర్ ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం.. గోదావరి బోర్డుకు పంపాల్సి ఉంది.

projects awaiting approval
projects awaiting approval

By

Published : Jun 21, 2022, 3:35 PM IST

అనుమతుల కోసం ఎదురుచూస్తోన్న గోదావరిపై ప్రాజెక్టులు

Godavari projects awaiting for approval: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర జలశక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అనుమతుల్లేని ప్రాజెక్టులకు జులై 14లోగా అనుమతులు పొందాల్సి ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 7 ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర జలసంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు సమర్పించింది. వాటి పరిశీలనా ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఏడింటికి గానూ ఇప్పటికే మూడు ప్రాజెక్టులు ప్రక్రియను పూర్తి చేసుకొని తుది ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి, చనాకా-కొరాటా ప్రాజెక్టులను జలసంఘం టీఏసీకి నివేదిస్తూ ఏప్రిల్ నెలలో జరిగిన జీఆర్ఎంబీ సమావేశం నిర్ణయం తీసుకొంది.

తదుపరి సమావేశంలో చర్చ.. దేశంలోని వివిధ ప్రాజెక్టుల కోసం నిర్వహించే తదుపరి టీఏసీ సమావేశంలో ఈ మూడు ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గూడెం ఎత్తిపోతల, మొడికుంటవాగులకు కూడా అనుమతుల ప్రక్రియ పూర్తయ్యింది. రెండు ప్రాజెక్టులను సీడబ్ల్యూసీ గోదావరి బోర్డుకు పంపింది. తదుపరి జరగనున్న బోర్డు సమావేశంలో వీటిపై చర్చిస్తారు.

త్వరలోనే ఆ అనుమతులు.. కీలకమైన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్కసాగర్ ఆనకట్టలను కేంద్ర జలసంఘం గోదావరి బోర్డుకు పంపాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. సీతారామ ఎత్తిపోతలకు నీటి లభ్యతకు సంబంధించిన హైడ్రాలజీ అనుమతులు వచ్చాయి. ఇతర డైరెక్టరేట్ల నుంచి కూడా అనుమతుల ప్రక్రియ పూర్తయ్యిందని అంటున్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతులు కూడా త్వరలోనే వస్తాయని చెబుతున్నారు. సమ్మక్కసాగర్‌కు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు.

ఆ దిశగా అధికారుల ప్రయత్నాలు.. వాస్తవానికి ఈ రెండు ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ చాలా రోజుల క్రితమే పూర్తయి గోదావరి బోర్డుకు వచ్చి ఉండాలన్నది అధికారుల అభిప్రాయం. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్కసాగర్ ప్రాజెక్టులను కూడా సీడబ్ల్యూసీ త్వరగా పంపితే తదుపరి జీఆర్ఎంబీ సమావేశంలో వాటిని కూడా పరిశీలించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆ దిశగా రాష్ట్ర నీటి పారుదల అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ, రామప్ప-పాకాల లింక్, కందకుర్తి ఎత్తిపోతల తదితరాలను.. గెజిట్ నోటిఫికేషన్‌లోని అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖను కోరింది.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details