- కొవిడ్ మరణాలపై ప్రభుత్వాల లెక్కలకు, వాస్తవాలకు పొంతన ఉండట్లేదు. మీ పరిశోధన ప్రకారం దేశంలో కరోనాతో ఎంతమంది చనిపోయి ఉంటారు?
మొదటిదశతో పోలిస్తే రెండో దశలో మరణాల సంఖ్యను ప్రభుత్వాలు బాగా తక్కువగా చూపిస్తున్నాయి. మొదటిదశలో సుమారు 1.50 లక్షల మంది కొవిడ్‌తో మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవ సంఖ్య అంతకంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ ఉండవచ్చని అంచనా. అప్పట్లో లెక్కల్లోకి రాని మరణాల సమాచారం ఇప్పటికీ బయటకు వస్తోంది. ఈ ఏడాది సంభవించిన రెండోదశలో ఏప్రిల్, మే నెలల్లో మహమ్మారి అత్యంత వేగంగా, ప్రమాదకరంగా ప్రబలింది. అనూహ్యరీతిలో ప్రాణాలను బలితీసుకుంది. మేం గణాంకాలు సేకరించిన నాలుగు రాష్ట్రాల జనాభా దేశంలో సుమారు 20 శాతం ఉంటుంది. వీటి ఆధారంగా లెక్కలు కడితే భారత్‌లో రెండో దశలోనే వెల్లడి కాని కొవిడ్ మరణాలు కనీసం 15 లక్షలుంటాయని అంచనా. ఇంకా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల వివరాలు రావాల్సి ఉంది. అవి అందితే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.
- భారత్, అనేక ఇతర దేశాలు 1918లో ఇన్‌ఫ్లుయెంజా మహమ్మారిని ఎదుర్కొన్నాయి. దాని వల్ల చనిపోయినవారిని గుర్తించడంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?
భారత్‌లో కొవిడ్ మాదిరే ఇన్‌ఫ్లుయెంజా రెండోదశలో దారుణ ప్రభావం చూపింది. 1918 సెప్టెంబరు నుంచి మూడునెలల పాటు చాలా తీవ్రంగా ఉంది. అప్పట్లో ల్యాబ్‌లు లేక జ్వరంతో చనిపోయినవారిని పరిగణనలోకి తీసుకునేవారు. ఆ మహమ్మారి వల్ల 60 లక్షల మంది చనిపోయారని అప్పటి శానిటరీ కమిషనర్ నార్మన్‌వైట్ 1919లో ప్రకటించారు. తర్వాత 1921లో జనగణన చేస్తే, కొన్ని గ్రామాల్లో అసలు జనాభా కనిపించలేదు. మరణాల సంఖ్య కోటి వరకూ ఉంటుందని అప్పుడు అంచనాలు సవరించారు. నా పరిశోధన ప్రకారం ఆ సంఖ్య రెండు కోట్ల వరకూ ఉంటుంది. మొదట ప్రకటించిన దానికంటే ఇది మూడురెట్లు ఎక్కువ.
- అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా, మృతుల వివరాలు సరిగా సేకరించలేకపోతున్నాం. కారణమేంటి?
వివిధ రాష్ట్రాల్లో మరణాలపై మేం గణాంకాలు సేకరిస్తున్నాం. ప్రభుత్వాలు సరైన సమాచారాన్ని వెల్లడించడంలేదు. తొక్కిపెడుతున్నాయని అర్థమవుతోంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సంభవించిన అదనపు మరణాలను ఇప్పటికీ కరోనా జాబితాలో చేర్చలేదు. భవిష్యత్తులో మరో మహమ్మారి వచ్చినా సమర్థంగా ఎదుర్కోవాలంటే... దేశంలోని అన్ని జిల్లాల్లో ఏ రోజు ఎంతమంది ఏ కారణాలతో చనిపోయారన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించాలి. మహమ్మారుల విషయంలో మరణాలను.. యుద్ధాల సమయంలో చూసినట్లు పరిగణించాలి. యుద్ధాల వల్ల సైనికులే కాదు పౌరులూ చనిపోతారు. అలాగే మహమ్మారి సోకినవారితో పాటు, దాని వల్ల ఏర్పడ్డ పరిస్థితుల వల్ల కూడా అనేక మంది మరణిస్తారు.
- అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనూ వాస్తవ మరణాలకు, ప్రభుత్వ లెక్కలకు తేడా ఉంటోంది. దీనిపై మీరేమంటారు?
అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా మృతుల సంఖ్యను ఒకటిన్నర, రెండు రెట్లు తక్కువగా చూపిస్తున్నారు. మన దేశంలోనూ తొలుత ముంబయి వంటి చోట్ల తక్కువగా చూపించారు. రెండోదశలో మహమ్మారి ప్రభావం అత్యంత వినాశకరంగా ఉంది. ఈసారి గ్రామీణ ప్రాంతాలకు విపరీతంగా విస్తరించింది. అక్కడ పరీక్షలకు సౌకర్యాలు లేవు. పట్టణాలు, నగరాల్లోనూ ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. దీంతో వైద్యం అందక పెద్దసంఖ్యలో ప్రజలు చనిపోయారు. గుండెజబ్బు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న అనేకమంది కూడా కొవిడ్ సమయంలో చికిత్స అందక మృతి చెందారు.
- భారత్‌లో 1918లో ఇన్‌ఫ్లుయెంజా ప్రబలిన కాలానికి, ఇప్పటికి సారూప్యతలు కనిపిస్తున్నాయి. అప్పటిలాగే గంగానదిలో పెద్దఎత్తున మృతదేహాలు కనిపించాయి. ఇలాంటి వైఫల్యాలకు కారణమేమిటి?