శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు విద్యార్థుల ప్రాణాలను మింగేస్తున్నా వాటిని కూల్చడంలో అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయం లేక... శిథిల భవనాల కూల్చివేతలో...తీవ్ర జాప్యం జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ అలసత్వం చేస్తున్నందున పాఠశాల విద్యాశాఖ.. ప్రభుత్వానికి కొత్త ప్రతిపాదనలు పంపింది.
శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం
By
Published : Aug 31, 2021, 3:02 AM IST
వర్షాలకు తడుస్తున్న పాఠశాల భవనాలు ఏ సమయంలో కూలతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం ఆ తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారింది. 2018లో విజయనగరం జిల్లా పాచిపెంటలో పాఠశాల మరుగుదొడ్డి గోడకూలి శశివర్ధన్ అనే విద్యార్థి మృతి చెందాడు. గోడ శిథిలావస్థ వల్లే ప్రమాదం జరిగిందని అప్పట్లో అధికారులు తేల్చారు. కాలం చెల్లిన భవనాలు కూల్చివేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చారు. కానీ
అమలు మాత్రం జరగలేదు. ఆ నిర్లక్ష్యానికి మూల్యమే తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాజుపాలెంలో చోటుచేసుకున్న తాజా దుర్ఘటన. పాఠశాలలో.. తోటి స్నేహితులతో ఆడుకుంటున్న పత్తి విష్ణువర్ధన్‌పై శిథిలావస్థకు చేరిన భవనం శ్లాబు ఒక్కసారిగా కూలింది.
రాష్ట్రవ్యాప్తంగా 6వేల514వరకూ శిథిలావస్థకు చేరిన తరగతి గదులున్నాయని అధికారులు గతంలోనే లెక్కగట్టారు. ఇందులో శ్రీకాకుళం జిల్లాలో 348 విజయనగరం జిల్లాలో 237, విశాఖ 571, తూర్పుగోదావరి 245, పశ్చిమ గోదావరి 452, కృష్ణా 429, గుంటూరు 507, ప్రకాశం 605, నెల్లూరు 734, చిత్తూరు 630, కడప 568, అనంతపురం 858,... కర్నూలు జిల్లాలో 330 తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి.
ఎవరు కూల్చాలి?
పాఠశాలలు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్నందున కూల్చివేతకు ఆ శాఖ అనుమతి తప్పనిసరిగా మారింది. పంచాయతీరాజ్ ఇంజినీర్లు వీటిపై దృష్టిపెట్టడం లేదు. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతంటూ..విద్యాశాఖ దాన్ని పట్టించుకోవడం లేదు. భవనం కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని ఎవరు భరించాలనే దానిపైనా సందిగ్ధత నెలకొంది. ఒక్కో తరగతి గది కూల్చివేతకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకూ అవుతుందని గతంలో సమగ్రశిక్ష అభియాన్ లెక్క తేల్చింది. ఈ నిధులు భరించేందుకు పంచాయతీరాజ్ శాఖ ముందుకు రాకపోవడంతో పాఠశాల నిర్వహణకు ఇచ్చే నిధులు వినియోగించుకోవాలని విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులకు సూచించింది. కూల్చివేతలపై... జాప్యం కారణంగా ఊహించని ఘటనలు జరిగి చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కాలం చెల్లిన భవనాల్లో తరగతులు నిర్వహించకపోయినా పాఠశాల విరామ సమయంలో పిల్లలు ఆడుకునేందుకు అటువైపు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వర్షాలకు తడుస్తున్న భవనాలు ఏ సమయంలో కూలతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రెండు శాఖల మధ్య సమన్వయలోపం చిన్నారులపాలిట శాపంగామారుతున్నాయి.
కలెక్టర్‌కు అధికారాలు..
ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి కొత్త ప్రతిపాదనలు పంపింది. నాడు-నేడు కింద తరగతి గదుల పనులు చేపడుతున్నందున శిథిలావస్థకు చేరిన భవనాల కూల్చివేత అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కోరింది. ఇందుకు అయ్యే వ్యయాన్ని పాఠశాల నిర్వహణ నిధుల నుంచి వెచ్చించాలని పేర్కొంది. తల్లిదండ్రుల కమిటీ తీర్మానం మేరకు శిథిలాల్లో వచ్చే ఇనుము, ఇతర సామగ్రిని విక్రయించి, పాఠశాల బ్యాంకు ఖాతాకు జమ చేయాలని ప్రతిపాదించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేదాకాభవనాల కూల్చివేత ప్రక్రియ ముందుకు కదిలే పరిస్థితి లేదు.