గోదావరి వరద అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల ప్రజల బతుకులను అతలాకుతలం చేసింది. వరద తీవ్రతను పసిగట్టడంలో అధికార యంత్రాంగం విఫలమవడంతో 4 మండలాలు నామరూపాల్లేకుండా పోయాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదతో బాధితులు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు పరుగులు తీశారు. రూ.లక్షల విలువైన సామగ్రిని, ప్రాణప్రదంగా పెంచుకుంటున్న మూగజీవాలను వెంట తీసుకెళ్లలేకపోయారు. కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక, చింతూరు మండలాల్లో ప్రస్తుతం ఎవరిని కదిపినా కళ్లలో నీరు సుడులు తిరుగుతోంది. పునరావాస కేంద్రం నుంచి తమ ఇంటిని చూసేందుకు వెళ్లిన బాధితులు అక్కడి పరిస్థితిని చూసి విలపిస్తున్నారు. నాలుగు మండలాల్లో 215 గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రధాన రహదారులూ మునగడంతో రాకపోకల్లేక నిత్యావసర వస్తువులు సైతం కొనుక్కోలేక.. పస్తులుండాల్సి వస్తోంది.
పట్టించుకోని ప్రభుత్వం
వరదలతో విలవిల్లాడుతున్నా అధికారులు, నాయకులు తమను పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం మంచినీరు ఇచ్చే నాథుడు కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పోలవరానికి భూములిచ్చిన తమను త్యాగధనులని జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారని, ఇప్పుడు కనీసం పట్టించుకోలేదని చెబుతున్నారు. ఏటా వరదలతో నష్టపోతున్నామని, తమకు పరిహారం అందిస్తే వేరే ప్రాంతానికి వెళ్లిపోతామని వారంతా ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
బాధితుల వివరాలు ఇలా..
ముంపునకు గురైన గ్రామాలు: చింతూరు-24, ఎటపాక-40, కూనవరం-78, వరరామచంద్రాపురం-73
నిర్వాసితులు: చింతూరు- 4,429, ఎటపాక-4,699, కూనవరం-26,245, వరరామచంద్రాపురం 25,597 మంది
కట్టుబట్టలతో మిగిలాను
ఎన్నికలకు ముందు జగన్ మా గ్రామానికి వచ్చి పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన మీరు త్యాగధనులని చెప్పారు. వరదల్లో మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు. రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మిని చూసి రెండేళ్లయింది. వరదలతో సర్వం కోల్పోయాం. నాకు వేసుకున్న లుంగీ, షర్టు తప్ప ఇంకేం మిగల్లేదు. ఆగస్టులో మళ్లీ వరదలు వచ్చే ప్రమాదముంది. ఈలోపు మాకు ప్యాకేజీ ఇస్తే వేరే ప్రాంతానికి వెళ్లిపోతాం. - జుతుక సూర్యచంద్రరావు, కూనవరం
ఐదు లక్షల సరకు కోల్పోయాం