కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోగులకు అవసరమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి సంస్థల నుంచి ప్రభుత్వాసుపత్రులకు తరలించేందుకు వాహనాల కొరత వేధిస్తోంది. దీంతో నైట్రోజన్ సరఫరాకు వినియోగించే వాహనాలను దీనికి ఉపయోగించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తి సంస్థల నుంచి ఆక్సిజన్‌ను దక్కించుకోవడం ఓ ఎత్తైతే.. దానిని ప్రభుత్వాసుపత్రులకు త్వరితగతిన సరఫరా చేయడం ఒక ఎత్తవుతోంది. తగిన సంఖ్యలో వాహనాలు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ను సకాలంలో చేరవేయడం అధికారులకు కత్తిమీద సాములా మారుతోంది.
నైట్రోజన్ వినియోగం
సాధారణ రోజుల్లో విశాఖ, చెన్నై, బళ్లారి ప్రాంతాల నుంచి 15 ప్రత్యేక వాహనాల ద్వారా ప్రభుత్వాసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా అయ్యేది. ఒక ఆసుపత్రికి రెండు, మూడు వారాలకు ఓసారి ఆక్సిజన్ సరఫరా జరిగేది. ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి ఆసుపత్రులకు ఆక్సిజన్ తీసుకురావాల్సిన పరిస్థితులు తలెత్తడంతో ప్రత్యేకంగా ట్యాంకులతో ఉన్న వాహనాలను సిద్ధం చేయడంలో సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరాకు 70 వాహనాలు సిద్ధమవుతున్నాయి. ఇవికాకుండా మరికొన్ని వాహనాలను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇవి ఇప్పటికిప్పుడు అందుబాటులోకి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో అధికారులు నైట్రోజన్‌ను తరలించే వాహనాలను వినియోగించుకొనేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, ఇతర విషయాల్లో మార్పులు చేయగలిగితే వీటిని వినియోగించుకోవచ్చన్న ఉద్దేశంతో వీలున్న మార్గాలు అన్వేషిస్తున్నారు.