ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని 268 మంది ఒప్పంద అధ్యాపకుల ఉద్యోగాలకు గండం ఏర్పడింది. తమ పోస్టులను క్రమబద్ధీకరిస్తారనే ఆశతో వారు ఇంతకాలం నిరీక్షిస్తున్నారు. ఎయిడెడ్ అధ్యాపకులు, రెగ్యులర్‌వారి బదిలీలతో వారు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తమ ఉద్యోగాలను కాపాడాలంటూ ఒప్పంద అధ్యాపకులు కళాశాల విద్య కమిషనరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. దీంతో శుక్రవారం రాష్ట్రంలో ఆర్జేడీ కార్యాలయాలు, కళాశాలల ఎదుట వారు ఆందోళనలు చేపట్టారు. ఎయిడెడ్ అధ్యాపకులకు పోస్టింగులను ఇచ్చేందుకు కౌన్సెలింగ్‌లో ఒప్పంద, పార్ట్‌టైం సిబ్బంది పని చేస్తున్న అన్ని పోస్టులనూ అధికారులు ఖాళీగా చూపారు. దీంతో ఎయిడెడ్ సిబ్బంది వెబ్ ఐచ్ఛికాలనిచ్చారు. ఎయిడెడ్ అధ్యాపకులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల తాము ఉద్యోగాలు కోల్పోతామని, తమను కాపాడాలంటూ ఇటీవల ఒప్పంద సిబ్బంది ఆందోళనలకు పిలుపునిచ్చారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వీరితో చర్చించి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సముదాయించారు. ఆయన హామీ అమలు కావడం లేదని ఒప్పంద అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందలాది ఉద్యోగాలు హుష్‌కాకి!