ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పండగ సందడి షురూ.. ఛార్జీల మోత మోగనుంది గురూ..! - special buses for sankranthi

సంక్రాంతి పండుగకు దేశ విదేశాల నుంచి సకుటుంబ సపరివార సమేతంగా జనం సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు.. ప్రైవేట్ వాహనాల్లోనూ ప్రయాణం చేస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు ధరలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా భారీగా టికెట్ ధరలు వసూలు చేస్తున్నారు. మరోవైపు నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.

పండగ సందడి షురూ.. ఛార్జీల మోత మోగనుంది గురూ..!
పండగ సందడి షురూ.. ఛార్జీల మోత మోగనుంది గురూ..!

By

Published : Jan 12, 2021, 7:23 PM IST

సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్​లో పనిచేస్తున్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా ఈ పండుగకు సొంతూళ్లకు బయలుదేరి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ బస్సులకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. గత ఏడాదితో పోల్చితే టికెట్ ధరలను భారీగా పెంచారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు సైతం అధిక ధరలు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం వంటి ప్రాంతాలకు ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్- విశాఖపట్టణానికి నాన్ ఏసీ బస్సులకు సుమారు రూ.990 నుంచి రూ.1110, ఏసీ బస్సులకు రూ.1190 నుంచి రూ.2544, నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు రూ.1100ల నుంచి 2690 వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు పేర్కొంటున్నారు. హైదరాబాద్- విజయవాడకు వెళ్లే నాన్​ ఏసీ బస్సులకు రూ.849 నుంచి రూ.1500 వరకు, ఏసీ బస్సులకు రూ.880 నుంచి రూ.2500 వరకు తీసుకుంటున్నారని తెలిపారు.

"లాక్​డౌన్​ తర్వాత కుటుంబ సమేతంగా ఊళ్లకు వెళ్తున్నాం. ప్రభుత్వ బస్సులేమో తక్కువున్నాయి. ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు అధికంగా ఉన్నాయి. గతేడాదికి ఇప్పటికీ సుమారు 30 శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. పిల్లలకు కూడా ఎక్కువ ఛార్జీలు తీసుకుంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఛార్జీలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నాం."- ప్రయాణికులు

లాక్​డౌన్​తో నెలల తరబడి షెడ్డులకే పరిమితమైన ప్రైవేట్ బస్సులు.. రోడ్డెక్కిన తర్వాత మొదటిసారిగా పూర్తిస్థాయిలో బస్సులు నిండుగా కన్పిస్తున్నాయని ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న తాము మళ్లీ బిజీగా మారిపోయామంటున్నారు. మరోపక్క ఆర్టీసీ బస్సులు సరైనన్ని నడపకపోవడం వల్లే ప్రైవేట్ బస్సుల్లో వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ వాళ్లే పూర్తిస్థాయిలో బస్సులు నడిపితే.. ప్రైవేట్ బస్సుల్లో ఎందుకు వెళతామని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో వెళదామంటే... ధరలేమో రెండింతలు, మూడింతలు ఎక్కువగా వసూలు చేస్తున్నారంటున్నారు. అయినా.. పెద్ద పండగ అవటం వల్ల వెళ్లక తప్పడంలేదంటున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ 4981 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3,380 బస్సులు, ఆంధ్రప్రదేశ్​కు 1,600 బస్సులు నడుపుతోంది. సంక్రాంతి పర్వదినం సందర్బంగా ఈనెల 8 నుంచి 14 వరకు నడుపుతున్నామని రంగారెడ్డి రీజియన్ మేనేజర్ బి.వరప్రసాద్ తెలిపారు. ప్రత్యేక బస్సులను సమర్థవంతంగా నడిపించేందుకు, ప్రయాణికులకు ఏ మాత్రం అసౌకర్యం కలుగకుండా తగు చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. మహాత్మాగాంధీ బస్​స్టేషన్, జూబ్లీ బస్​స్టేషన్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్డ్, ఎల్బీనగర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్బీ, ఎస్సాఆర్‌ నగర్, అమీర్​పేట, టెలిఫోన్ భవన్, దిల్​ సుఖ్​ నగర్​లతో పాటు జంట నగరాలలోని వివిద శివారు కాలనీల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి, అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాటు చేశామన్నారు.

సంక్రాంతి సందర్భంగా నడిపే ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ అధికారులు దృష్టిసారించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సులను ముఖ్యమైన కూడళ్లలో తనిఖీలు చేస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వెళితే... జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు పాటించని బస్సులకు ఫైన్ వేస్తున్నారు. రెండు రోజుల నుంచి ఖైరతాబాద్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 82 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశామని హైదరాబాద్ జేటీసీ పాండురంగానాయక్ తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు 35 బస్సులకు జరిమానా విధించారు. కమర్షియల్ గూడ్స్​ను తరలిస్తున్న వాటిపై దృష్టిసారించామని రవాణాశాఖ అధికారులు తెలిపారు. టాక్స్​లు కట్టకుండా తిరుగుతున్న ఒక బస్సును, ఎక్కువగా నాలుగు సీట్లు ఏర్పాటు చేసుకున్నందుకు మరో బస్సును సీజ్ చేశారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు.

ఇదీ చూడండి:బస్సుకు విద్యుత్​ తీగలు తగిలి ఐదుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details