జూన్ ఆఖరు వరకు బస్సులు నడపబోమంటూ పలు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు రవాణా శాఖకు ముందస్తు అర్జీలు పెట్టుకున్నాయి. వీటిలో రాష్ట్రానికి చెందిన బస్సుల్లో సగానికిపైగా ఉన్నాయి. వివిధ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన 800 వరకు బస్సులున్నాయి. తెలంగాణకు చెందిన మరో 800 బస్సులు రాష్ట్రానికి వస్తుంటాయి. రవాణా వాహనాలు 3 నెలలపాటు నడపకూడదని భావిస్తే.. త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు తొలి త్రైమాసికంలో పన్ను మినహాయించాలంటే మార్చి చివరి నాటికే దరఖాస్తు చేసుకోవాలి. మార్చిలో లాక్‌డౌన్ విధించడం, ప్రజా రవాణాపై ఆంక్షలుంటాయని భావించిన పలు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు చాలావరకు బస్సులు నడపబోమని దరఖాస్తు చేసుకున్నాయి. రవాణాశాఖ అధికారులు ఆన్‌లైన్‌లోనే కాకుండా, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల స్వీకరణకు అవకాశమిచ్చారు. దీంతో 400కుపైగా బస్సులకు సంబంధించి వాటి యాజమాన్యాలు జూన్ వరకు నడపబోమని తెలియజేస్తూ త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు పొందాయి.