Modi in Hyderabad: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన షురూ అయింది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా ఓసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తరఫున సీఎస్ సోమేశ్ కుమార్ మోదీని ఆహ్వానించారు.
Modi at Begumpet Airport: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భాజపా నేతలు బేగంపేట ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మోదీ.. భాజపా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 'పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం' అంటూ ప్రధాని మోదీ ప్రసంగం మొదలుపెట్టారు. తాను ఎప్పుడు తెలంగాణకు వచ్చిన ఇక్కడి ప్రజలు తనకు అపూర్వ స్వాగతం పలికారని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత ఎండలోనూ తనకు స్వాగతం పలకడానికి వచ్చిన కాషాయ శ్రేణులకు మోదీ ధన్యవాదాలు చెప్పారు.