ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MOdi at Icrisat: ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి: ప్రధాని మోదీ

By

Published : Feb 5, 2022, 3:42 PM IST

Updated : Feb 5, 2022, 4:50 PM IST

MOdi at Icrisat: హైదరాబాద్‌లో జరుగుతున్న ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సాగు సంబంధిత ఎగ్జిబిషన్‌ను ప్రధాని తిలకించారు. మోదీతో పాటు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. వసంత పంచమి రోజునే ఇక్రిశాట్​ స్వర్ణోత్సవం జరగడం ఆనందదాయకమని అన్నారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలని ఆకాంక్షించారు.

MOdi at Icrisat
MOdi at Icrisat

PM Modi on ICRISAT: ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించారు. ప్రధానిని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్ జాక్వెలిన్‌ డి ఆరోస్‌ సన్మానించారు. ఇక్రిశాట్‌ పరిశోధనలు పురోగతిపై ప్రధానికి శాస్త్రవేత్తలు వివరించారు. ఇక్రిశాట్​లో క్లైమేట్ చేంజ్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీని, రాపిడ్ జెన్ రీసెర్చ్‌ ఫెసిలిటీని ప్రధాని మోదీ ఆయన చేతులమీదుగా ప్రారంభించారు.

శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని

MOdi at Icrisat: ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో ప్రధాని.. ఎయిర్​పోర్టులో ఘనస్వాగతం

వసంత పంచమి రోజునే ఇక్రిశాట్​ స్వర్ణోత్సవం జరగడం ఆనందదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పంటలపై ఇక్రిశాట్‌ విజ్ఞానం, ఆవిష్కరణలో.. 50 ఏళ్లుగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలను ప్రధాని అభినందించారు. ఐదు దశాబ్దాల కాలంలో భారత్‌ ఆహార సమృద్ధి సాధించిందన్న మోదీ.. వచ్చే యాభై ఏళ్లు మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని పీఎం మోదీ స్పష్టం చేశారు.

ఇక్రిశాట్​ది కీలకపాత్ర..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పంటల దిగుబడి గణనీయంగా ఉందన్న ప్రధాని.. సాగు విస్తీర్ణం పెంచడంలో ఇక్రిశాట్‌ది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలని ఆయన సూచించారు. పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు సృష్టించాలన్నారు. భారత్‌లో 80 శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నారని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో చిన్న రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారన్న ఆయన.. వారి సాగు వ్యయం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్రిశాట్‌ పరిశోధనలతో సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. భారత్‌లో 6 రుతువులు 15 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని పీఎం మోదీ పేర్కొన్నారు.

డిజిటల్​ అగ్రికల్చర్​ లక్ష్యంగా..

ఈ బడ్జెట్‌లో సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రధాని వెల్లడించారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుతున్నామన్నారు. డిజిటల్‌ అగ్రికల్చర్ పెంచాలనే లక్ష్యంతో ఉన్నామన్న ఆయన.. సాగులో డ్రోన్ల వినియోగం పెంచేందుకు నిధులను కూడా కేటాయించామన్నారు. సాగు భూముల వివరాలను డిజిటలైజ్‌ చేశామన్నారు. అంతిమంగా అందరి లక్ష్యం...వ్యవసాయాభివృద్ధేనని ప్రధానమంత్రి అన్నారు. రైతులు కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ దిగుబడి సాధిస్తున్నారన్నారు.

డిజిటల్ అగ్రికల్చర్‌తో వ్యవసాయరంగంలో పెనుమార్పులు

భారత్‌లో 50 వరకు ఆగ్రో క్లైమేట్‌ జోన్లు ఉన్నాయి. దేశంలోని 170 జిల్లాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టాం. డిజిటల్ అగ్రికల్చర్‌తో వ్యవసాయరంగంలో పెనుమార్పులు. సేంద్రియ సాగుపై రైతులు మరింత దృష్టి సారించాలి. పామాయిల్‌ ఉత్పత్తిలో ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉంది. తెలంగాణలో ఆయిల్‌ పామ్‌ సాగు ఆశావహంగా ఉంది. పామాయిల్‌ సాగుతో ఏపీ, తెలంగాణకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పామాయిల్ సాగులో తెలుగు రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తాం. ఆహార భద్రతతో పాటు పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బయో ఫ్యూయెల్‌తో రైతులకు సాగు ఖర్చు తగ్గనుంది. పరిశోధనలు, ఆవిష్కరణలు రైతుల సమస్యలను తీర్చాలి.

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

2 వేల మందితో భద్రత

మెట్ట పంటల పరిశోధనలను ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇక్రిశాట్‌ వద్ద 2 వేల మందికిపైగా పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇక్రిశాట్‌ ప్రధాన ద్వారం వద్ద ఒకవైపు మూసివేశారు. అనంతరం ముచ్చింతల్‌కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.

ఎయిర్​పోర్టులో ఘనస్వాగతం

ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్‌ తమిళిసై, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అస్వస్థత కారణంగా సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

ఇదీ చూడండి:

Last Updated : Feb 5, 2022, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details