పిల్లలకు మేనమామలా ఉంటానని పదేపదే చెబుతున్న సీఎం జగన్.. వారు తినే మధ్యాహ్న భోజనం ఛార్జీలను మాత్రం పెంచడం లేదు. మెనూ మార్పు చేసినట్లు గొప్పగా చెబుతున్నా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఛార్జీల పెంపునకు మాత్రం చొరవ చూపడం లేదు. జగనన్న గోరుముద్దగా పథకం పేరు మార్చిన ప్రభుత్వం.. చుక్కలను తాకుతున్న ధరలకు అనుణంగా భోజనం ఛార్జీలు పెంచడంపై దృష్టి సారించడం లేదు. భోజనం నాణ్యంగా ఉండాలి.. తనిఖీలు నిర్వహించాలని ఆదేశిస్తున్న అధికారులు ఛార్జీలు పెంచకపోతే నాణ్యత ఎలా వస్తుందో ఆలోచించడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న ధరలతో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం ఇబ్బందిగా మారిందని వంట కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 45,054 పాఠశాలల్లోని 38.44 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. 1-5 తరగతుల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు కేంద్రం రూ.1.98 ఇస్తుండగా.. రాష్ట్రం రూ.2.42 చెల్లిస్తోంది. 6- 8 తరగతులకు కేంద్రం రూ.4.44, రాష్ట్రం రూ.3.36 భరిస్తున్నాయి. 9,10 తరగతులకు రూ.7.80 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రస్తుత ధరలకు ఈ ఛార్జీలు సరిపోవడం లేదని, ఒక్కో విద్యార్థికి రూ.9- రూ.10 ఇవ్వాలని వంట ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి.
రుచికరమైన పోషకాహారాన్ని అందించేలా జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నాం. రోజూ ఒకేరకంగా కాకుండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు మెనూలో మార్పులు చేశాం. నిర్దేశించిన మెనూ మేరకు పిల్లలకు ఆహారం అందుతుందా లేదా నిరంతరం పర్యవేక్షించాలి. - సమీక్షల్లో సీఎం జగన్
మార్కెట్‌లో గ్యాస్, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇందుకు అనుగుణంగా జగనన్న గోరుముద్ద పథకం భోజనం ఛార్జీలు పెంచలేదు. కందిపప్పు, నూనెలు, చింతపండు, కూరగాయల ధరలు అప్పటితో పోల్చితే 17 శాతం నుంచి 90 శాతం వరకు పెరిగాయి. పిల్లలకు భోజనం పెట్టేందుకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదు. - మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు