‘‘మాకు ఇప్పటికే ఆర్థిక సమస్యలున్నాయి. వెంటనే ఇంటిని కట్టుకోలేం. కొంత సమయమివ్వాలి. లేదంటే పట్టాను వెనక్కి తీసుకోండి. నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ప్రభుత్వం రాయితీ పెంచితేనే పనులు చేయడానికి ఆలోచిస్తాం. మేం ఇప్పటికిప్పుడు నివసిస్తున్న ఇంటిని పడగొట్టి కొత్త నిర్మాణం చేపట్టడం కష్టం. మీ పట్టాలను మీరే తీసుకోండి’’ అని ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం’ లబ్ధిదారులు అధికారులకు తేల్చి చెబుతున్నారు. గృహ నిర్మాణాలను వేగిరం చేసేందుకు లబ్ధిదారులపై క్షేత్ర స్థాయిలో అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
ఇళ్ల్లు కడతారా? కడితే... ఎప్పుడు ప్రారంభిస్తారు? అసలు మీ ఇబ్బందులేమిటి? నిర్మించకుంటే... అదే విషయాన్ని రాతపూర్వకంగా రాసివ్వండి... అని అడుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పట్లో సొంతంగా నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేదని లబ్ధిదారులు చెబితే... ‘మీరు కట్టుకోకపోతే రాయితీని వేరే వారికి మంజూరు చేస్తాం. మళ్లీ మీరు నిర్మించుకునేటప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది’ అని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తుండగా... నిరుపేదలు వందల సంఖ్యలో పట్టాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు.'
అవగాహన పేరిట అంతులేని ఒత్తిడి
ఇళ్ల నిర్మాణాలపై అవగాహన పేరిట గ్రామాల్లో తహసీల్దారు, ఎంపీడీవో, హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఇలా వరుసబెట్టి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్తూ ఒత్తిడి చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేక, ఒత్తిడిని భరించలేక కొందరు లబ్ధిదారులు పట్టాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు.
కడప జిల్లా ముద్దనూరు మండలానికి 1,600 ఇళ్లు మంజూరైతే అందులో 500 మంది ఇప్పట్లో నిర్మించుకోలేమని అధికారులకు తెలిపారు. అధికారుల ఒత్తిడితో 200 మంది తమ పట్టాలను వెనక్కిచ్చేశారు.
- చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోనూ 400 మంది ఇప్పట్లో కట్టుకోలేమని చెప్పారు.
- తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం, అల్లవరం, కర్నూలు జిల్లా డోన్, నెల్లూరు జిల్లా కావలిలో వెంటనే పనులు ప్రారంభించకుంటే పట్టా రద్దు చేస్తామని లబ్ధిదారులను వాలంటీర్లు హెచ్చరించారు.
- ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించకుంటే పట్టాలను వెనక్కి తీసుకునే అవకాశముందని శ్రీకాకుళం జిల్లాలో అధికారులు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం, నక్కపల్లిలోనూ మౌఖిక ఆదేశాలిచ్చారు.
- పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో 4వేల మందికి నోటీసులిచ్చారు.
ఇదీ అసలు కారణం..