ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అడగకముందే మద్దతిచ్చారు.. వైకాపాకు ముర్ము కృతజ్ఞతలు - Draupadi Murmu visit to andhrapradesh

Draupadi Murmu ap tour: రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము వైకాపా ప్రజా ప్రతినిధులను కోరారు. తాను అడగకముందే జగన్ మద్దతిచ్చారంటూ.. ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయంలో భాగంగా ముర్ముకు ఓటేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్ నిర్దేశించారు.

సీఎం జగన్​ను కలిసిన ద్రౌపది ముర్ము
సీఎం జగన్​ను కలిసిన ద్రౌపది ముర్ము

By

Published : Jul 12, 2022, 7:07 PM IST

Updated : Jul 13, 2022, 3:47 AM IST

Draupadi Murmu AP Tour: 'రాష్ట్రపతి పదవికి నా అభ్యర్థిత్వం సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు ఒక నిదర్శనం' అని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆమె వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఒక ఫంక్షన్‌హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్‌ ఆమెకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. 'దేశానికి మొట్టమొదటిసారిగా గిరిజన మహిళ రాష్ట్రపతి కానున్నారు. ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాలి. వైకాపా మొదటి రోజునుంచీ సామాజిక న్యాయానికి ఎలా పెద్దపీట వేస్తోందో అందరికీ తెలుసు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన మొట్టమొదటి ప్రభుత్వం మనది. అందులోభాగంగా ముర్మును ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉంది పార్టీ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా బలపరచాలని కోరుతున్నా' అని ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము 'ఆంధ్ర ప్రజలకు నా నమస్కారాలు' అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి మాట్లాడారు.. 'నేను ఒడిశాలోని మారుమూల గిరిజన గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళను. దేశంలోని ప్రధాన గిరిజన తెగల్లో ఒకటైన సంతాల్‌ తెగకు చెందిన మహిళను. ఈ నెల 18న పోలింగ్‌ జరగనుంది, మీ సోదరిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. సమర్థించమని నేను కోరకముందే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ నా అభ్యర్థిత్వాన్ని హృదయపూర్వకంగా బలపరిచినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా' అని పేర్కొన్నారు. 'మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను నిర్వహించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో వచ్చే 25 ఏళ్లలో దేశం అన్నిరంగాల్లో ఇంకా ఎంతో పురోగమించేలా ప్రధాని నరేంద్రమోదీ రోడ్‌మ్యాప్‌ రూపొందించారు. అందరి భాగస్వామ్యం, సహకారంతో దాన్ని సాకారం చేయాలని ఆయన సంకల్పించారు. మన దేశం పట్ల విదేశాల్లో గౌరవం పెరిగింది, మన పట్ల వారి దృక్పథంలోనూ మార్పు వచ్చింది' అని తెలిపారు.

మన రెండు రాష్ట్రాలకు సారూప్యత
'ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ ఇరుగుపొరుగు రాష్ట్రాలు, అందుకే ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లలో రెండురాష్ట్రాల మధ్య ఎంతో సారూప్యత ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చాలా కష్టపడతారు. ఇక్కడ పండించిన బియ్యం, మత్స్య సంపదకు దేశంలో ఎంతో డిమాండ్‌ ఉంది. పర్యాటక కేంద్రాలతో పాటు తిరుమల వంటి ఆధ్మాత్మిక కేంద్రమూ రాష్ట్ర ప్రత్యేకత. స్వాతంత్య్రోద్యమంలోనూ ఏపీ కీలకభూమిక పోషించింది. చీరాల పేరాల ఉద్యమం, అల్లూరి నేతృత్వంలో జరిగిన రంప తిరుగుబాటు వంటివి ఉన్నాయి. సైమన్‌ గో బ్యాక్‌, సహాయ నిరాకరణ, క్విట్‌ ఇండియా లాంటి ఉద్యమాల్లోనూ తెలుగువారు చురుగ్గా పాల్గొన్నారు. ‘శాస్త్రీయ భాషగా తెలుగు, కూచిపూడి నృత్యం రెండూ ఎంతో పేరుపొందాయి. పుణ్యక్షేత్రాలు, సాంస్కృతిక కట్టడాలే కాదు, పూతరేకులు, కాజాల వంటి ఆహార పదార్థాలకూ ఏపీ ప్రసిద్ధి. ఉప్పాడ, కలంకారీ వస్త్రాలు, తోలుబొమ్మలాట, ఏటికొప్పాక బొమ్మలు.. ఇలా ఎన్నెన్నో ఏపీ కీర్తికిరీటంలో ఉన్నాయి. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించిన నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, సోమనాథుడు, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ట లాంటి ఎందరో మహానుభావాలను స్మరించుకుంటున్నా.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, ఎన్టీ రామారావు లాంటి వారంతా గొప్ప నాయకులు, వాళ్లందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా’ అని తెలిపారు.

పార్టీ నిర్ణయాన్ని బలపరచాలని కోరుతున్నా
‘ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా ఈ నెల 18న పోలింగ్‌లో పాల్గొని ఓట్లు వేయాలి. ఎంపీలంతా వచ్చేలా విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యేలంతా వచ్చి ఓటు వేసేలా మంత్రులు, ప్రభుత్వ విప్‌లు బాధ్యత తీసుకోవాలి. 18న మాక్‌ పోలింగ్‌లో పాల్గొన్నాకే, పోలింగ్‌కు వెళ్లాలి. దీనివల్ల ఓటింగ్‌లో తప్పులు దొర్లకుండా నివారించగలం. పోలింగ్‌ రోజు ఎవరు రాకపోయినా ఒక ఓటును మనమే తగ్గించినవారమవుతాం. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడుతున్నపుడు మనవైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది’ అని ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యానించారు. ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒడిశాలో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ముర్ము ఇప్పుడు రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలే కాకుండా ఇతర పార్టీలూ బలపరిచాయి’ అని తెలిపారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘దేశ రాష్ట్రపతులుగా గతంలో అబ్దుల్‌ కలాం, ప్రస్తుతం రామ్‌నాథ్‌ కోవింద్‌, ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము పోటీచేయడం ఈ పంథా మంచి సామాజిక విప్లవానికి దారితీస్తుంది’ అన్నారు. ఈ సమావేశానికి వైకాపా ఎమ్మెల్యేలు పలువురు గైర్హాజరయ్యారు. ముగ్గురు మినహా మంత్రులంతా హాజరు కాగా, ఎంపీల్లో కొందరు గైర్హాజరయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముర్ము నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఆమెకు ముఖ్యమంత్రి తేనీటి విందునిచ్చారు. విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన వేదపండితులు ఆమెకు వేద ఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, ముఖ్యమంత్రి భార్య భారతి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 13, 2022, 3:47 AM IST

ABOUT THE AUTHOR

...view details