President Respond on MP Gorantla Video Viral Issue: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి అందజేసిన ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన డిగ్నిటీ ఫర్ ఉమెన్ జేఏసీ నేతలు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కడ్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్, పలువురు కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారు.
అయితే, రాష్ట్రపతికి ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ నెల 23న మహిళా జేఏసీ నేతలంతా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని సీఎస్‌కు పంపి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిపింది. ఈ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి సమాచారం ఇస్తూ లేఖ పంపింది.
గతంలో గవర్నర్‌ను కలిసిన మహిళ ఐకాస నేతలు:ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంతో పాటు మూడేళ్లుగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అఖిలపక్షాల మహిళా ఐకాస నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అఖిలపక్షాల మహిళా ఐకాస నేతలు.. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించిన ప్రజా ప్రతినిధులపై చర్యలు ఉండకపోవటంతో పాటు అధికారులు, మంత్రులు తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్న తీరును వివరించారు. కేంద్ర ఫోరెన్సిక్కి ఎంపీ వీడియో వ్యవహారం అప్పగించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు మహిళల పట్ల ఎలా ఉండాలనే దానిపై శిక్షణ తరగతులు ఉండాలని సూచించారు.