ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాపికొండల్లో పులుల గణనకు సన్నాహాలు.. 250 కెమెరాల ఏర్పాటుకు కసరత్తు

పాపికొండలు జాతీయ పార్కులో పులుల గణన-2022కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం వన్యప్రాణుల సంరక్షణ అటవీ డివిజన్‌ ఆధ్వర్యంలో దీన్ని చేపట్టారు. దీని కోసం 250 కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

papikondalu
papikondalu

By

Published : Jul 3, 2021, 10:45 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని పాపికొండలు జాతీయ పార్కులో పులుల గణన-2022కు శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం వన్యప్రాణుల సంరక్షణ అటవీ డివిజన్‌ ఆధ్వర్యంలో దీన్ని చేపట్టారు. అక్టోబరు నుంచి మొదలుకానున్న ఈ గణనకు రెండు జిల్లాల పరిధిలోని అటవీ సిబ్బందికి ఇటీవల కార్యశాల నిర్వహించారు. 1,012.85 చ.కి.మీ.మేర విస్తరించిన దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో పులులు, చిరుతలు, ఇతర అరుదైన జంతు, పక్షి జాతులున్నాయి.

పులుల జాడలు

జాతీయ పులుల సంరక్షణ విభాగం (ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో నాలుగేళ్లకోసారి జాతీయ పులుల గణన నిర్వహిస్తున్నారు. 2014నాటి గణనలో తెలుగురాష్ట్రాల్లో 68 పులులను గుర్తించగా పాపికొండలు అటవీప్రాంతంలో మూడు పులులున్నట్లు తేల్చారు. 2018 గణనలో ఏపీలో 48, తెలంగాణలో 26 గుర్తించారు. అప్పటి గణనలో పులుల జాడ పాపికొండలు జాతీయపార్కులోని కెమెరాలకు చిక్కకపోయినా తర్వాత చింతూరు పరిధిలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు.

గతనెల 22న ఇక్కడున్న సీసీ కెమెరాకు చిరుతపులి దృశ్యాలు చిక్కాయి. ఇతర వన్యప్రాణుల జాడలూ వెలుగుచూస్తున్నాయి. ఎన్‌టీసీఏ మార్గదర్శకాల ప్రకారం తాజా పులుల గణన కోసం లొకేషన్ల గుర్తింపుతోపాటు దృశ్యాల చిత్రీకరణకు 250 కెమెరా ట్రాప్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం అటవీ డివిజన్‌ వన్యప్రాణుల సంరక్షణ విభాగం అధికారి సి.సెల్వరాజ్‌ తెలిపారు.

పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నట్టు గతంలో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గోదావరి ప్రాంతంలోని తెల్లదిబ్బల ప్రదేశంలో రాత్రి వేళ పులుల గాండ్రింపులు వినిపిస్తున్నాయని గిరిజనులు అధికారులకు తెలిపారు. అయితే పులులు తాము ఏర్పాటు చేస్తున్న ట్రాప్‌ కెమెరాకు చిక్కకుండా తిరుగుతున్నాయని, వాటి అలికిడిని మాత్రం గమనిస్తున్నామని ఫారెస్ట్‌ అధికారులు చెప్పేవారు. ఇప్పుడు వీటిని గుర్తించేందుకు 250 కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

జాతీయ పార్కుల్లో బేస్ క్యాంపులు

రాష్ట్రంలో జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో గనుల తవ్వకం, వేట, ఆక్రమణ, చొరబడటం తదితర సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ రక్షిత ప్రాంతాలలో 94 బేస్‌ క్యాంప్‌లను ఏర్పాటుచేయడంతో పాటుగా 8 సాయుధ దళాలను సైతం ప్రొటెక్టడ్‌ ఏరియా మేనేజర్లతో సహా ఏర్పాటు చేసింది. ఒకవేళ జంతువుల దాడి జరిగి ప్రాణాలు కోల్పోయినా లేదంటే గాయాల బారిన పడినా తక్షణమే పరిహారాన్ని సైతం అందిస్తున్నారు. ఈ రక్షిత ప్రాంతాలకు చుట్టు పక్కల గ్రామాలు, స్థానిక సమాజాలలో అవగాహన శిబిరాలను సైతం ఏర్పాటు చేయడంతో పాటుగా వీటి రక్షణలో స్థానికులకు సైతం భాగం కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి:KRISHNA BOARD: జల వివాదం..రంగంలోకి కృష్ణా బోర్డు

ABOUT THE AUTHOR

...view details