ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

50 ఏళ్ల లీజుకు బస్టాండ్ల స్థలాలు!

ఏపీలో 5 ఆర్టీసీ బస్టాండ్లను ఇంటిగ్రేటెడ్‌ బస్టాండ్లుగా అభివృద్ధి చేయాలని.. దీనికి ముందుకొచ్చే గుత్తేదారులకు ఆ స్థలాలను 50 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని భావిస్తున్నారు.

Preparations are underway to develop 5 RTC bus stands in the state as integrated bus stands
50 ఏళ్లలీజుకు బస్టాండ్ల స్థలాలు

By

Published : Nov 30, 2020, 10:00 AM IST

రాష్ట్రంలోని 5 ఆర్టీసీ బస్టాండ్లను ఇంటిగ్రేటెడ్‌ బస్టాండ్లుగా అభివృద్ధి చేయాలని.. దీనికి ముందుకొచ్చే గుత్తేదారులకు ఆ స్థలాలను 50 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఏపీయూఐఏఎంఎల్‌) చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. అయితే ఈ విలువైన స్థలాలు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆర్టీసీ (పీటీడీ) ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

విజయవాడలోని ఆటోనగర్‌ (2 ఎకరాలు), హనుమాన్‌ జంక్షన్‌ (1.7 ఎకరాలు), కర్నూలులోని రాజవిహార్‌ బస్టాండ్‌ (2 ఎకరాలు), తిరుపతి (13 ఎకరాలు), విశాఖలో మద్దిలపాలం (6 ఎకరాలు) బస్టాండ్లు, డిపోల స్థలాలను ఇంటిగ్రేటెడ్‌ బస్టాండ్లుగా అభివృద్ధి చేయడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించాలని భావిస్తున్నారు. గుత్తేదారు గ్రౌండ్‌ఫ్లోర్‌లో బస్టాండు నిర్మాణాలు చేసి, పైఅంతస్తులను వాణిజ్య సముదాయంగా నిర్మించుకోవాలి. గుజరాత్‌ విధానాన్నే ఇక్కడా అమలు చేయనున్నారు. దీనిపై నివేదిక తయారీ బాధ్యతను ఏపీయూఐఏఎంఎల్‌కు అప్పగించారు. ఆయా స్థలాలు 30-33 ఏళ్లకు లీజుకు ఇస్తే ఇంటిగ్రేటెడ్‌ బస్టాండ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రారని, కనీసం 50 ఏళ్లు లీజు గడువు ఉండాలని ఆ సంస్థ ఇటీవల అధికారులకు వివరించింది. నెల రోజుల్లో పూర్తి నివేదిక అందజేయనుంది.

విలువైన స్థలాలు ప్రైవేటుకు ధారాదత్తం!

విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో రూ.వందల కోట్ల విలువైన స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు 50 ఏళ్లకు లీజుకు ఇస్తే.. ఆర్టీసీకి నష్టమేనని ఉద్యోగసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 50 ఏళ్ల తర్వాత ఆ స్థలాలను ఆయా సంస్థలు వదులుకోవని పేర్కొంటున్నాయి. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఈ స్థలాలు ధారాదత్తం చేయడమేనని చెబుతున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ బస్టాండ్ల నిర్మాణానికి ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలు, ఈ స్థలాలను బ్యాంకులో కుదవపెట్టి రుణాలు తీసుకుంటాయని, ఆర్టీసీయే అలా నిధులు సమకూర్చుకొని అభివృద్ధి చేయొచ్చని ఉద్యోగసంఘాల నేతలు అంటున్నారు.

మూడు బస్టాండ్లలోనే మౌలిక వసతులు

రాష్ట్రంలోని 21 బస్టాండ్లలో నాడు-నేడు కింద మౌలిక వసతులు పెంచాలని తొలుత భావించగా, ప్రస్తుతానికి మూడు చోట్లే వీటిని కల్పించనున్నారు. 21 బస్టాండ్లలో మౌలిక వసతులపై డీపీఆర్‌ తయారీకి టెండర్లు పిలవగా, మూడు సంస్థలు బిడ్లు వేశాయి. వీటిలో చెన్నైకి చెందిన సంస్థ ఒక్కటే అర్హత సాధించింది. అయితే ఈ సంస్థ పెద్దమొత్తం కోట్‌ చేయడంతో.. తొలుత మూడు బస్టాండ్లకే పరిమితం కావాలని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరుతో పాటు, చిత్తూరు జిల్లాలో రెండు బస్టాండ్లకు డీపీఆర్‌ తయారుచేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

మన చెరువులకు అంతర్జాతీయ గౌరవం

ABOUT THE AUTHOR

...view details