ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: బీభత్సం సృష్టించిన అకాల వర్షాలు - telangana varthalu

తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కల్లాల్లో పోసిన ధాన్యం రాసులు పూర్తిగా తడిసిపోయాయి. తమ కష్టం నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు నేలకొరిగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

heavy rains  at Telangana
బీభత్సం సృష్టించిన అకాల వర్షాలు

By

Published : May 12, 2021, 6:54 AM IST

బీభత్సం సృష్టించిన అకాల వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా వివిధచోట్ల అకాల వర్షం కురిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షం ధాటికి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం ఐకేపీ కేంద్రంలో పిడుగుపాటుకు గురై... ఓ మహిళ మృతిచెందింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం తడవకుండా రైతులు తీవ్రంగా ప్రయత్నించినా... ఫలితం లేకుండా పోయింది. మద్దిరాల మండలం చిన్ననెమిలలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రెడ్డినాయక్ తండాలో వర్షానికి 20 ఇళ్లు కూలిపోయాయి.

కొట్టుకుపోయిన ధాన్యం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. దేవరకద్రలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆరబెట్టుకున్న ధాన్యం... నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణ సముదాయల రేకుల షెడ్లు గాలికి ఎగిరిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఆవంచ, మారేపల్లి, ఇప్పలపల్లి, బుద్ధ సముద్రం, నేరెళ్ల పల్లిలో చేతికొచ్చిన పంట పూర్తిగా తడిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు టార్పాలిన్లు, పాలిథిన్ కవర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఉప్పునుంతల మండలం లత్తిపూర్‌లో పిడుగుపాటుకు మూడు ఆవులు మృత్యువాత పడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

పిడుగులు పడి..

వరంగల్, హన్మకొండ, కాజీపేటల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్ధన్నపేట మండలం నెల్లబెల్లిలో పిడుగుపాటుకు కాంతమ్మ అనే మహిళ చనిపోయింది. నడికూడ మండలం.. రాయపర్తి ఐకేపీ కేంద్రం సమీపంలో రవీంద్రాచారి అనే రైతు... ధాన్యం తడవకుండా ఉండేందుకు వేసిన పరదాలు కొట్టుకుపోకుండా ఉండేందుకు రాళ్లు తెస్తుండగా.....పిడుగు పడి మృతిచెందాడు. ఎనగల్లు, పర్వతగిరి, కల్లెడ తదితర గ్రామాల్లోనూ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిముద్దైంది. ములుగు జిల్లాలో అరగంటపాటు కురిసిన వానకు రహదారులు జలమయం అయ్యాయి. కాశిందేవిపేటలో పిడుగుపడి రంజన్ అనే రైతు మృతిచెందాడు. సంగెం మండలం... కుంటపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఓ ఇంట్లో కొబ్బరి చెట్టుపై పిడుగుపడడంతో...చెట్టు దగ్ధమైంది.

ఇళ్లు ధ్వంసం

కుమురం భీం జిల్లా పెంచికలపేటలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇళ్లలోని బియ్యం సహా ఇతర సామాగ్రి నీటిలో మునిగాయి. గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రేకులు ఎగిరి వచ్చి పశువులపై పడటంతో అవి గాయపడ్డాయి. సిర్పూర్ టి మండలంలో రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి:

పిల్లలపై కొవాగ్జిన్​ 2, 3 దశల క్లీనికల్​ ట్రయల్స్​!

ABOUT THE AUTHOR

...view details