గుండె బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత చాలామందికి సరిగా నిద్ర పట్టదు. రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యమూ తగ్గుతుంటుంది. ఆర్నెల్లు దాటినా నిద్ర సమస్య తగ్గకపోతే గుండె ఆరోగ్యం దెబ్బతినొచ్ఛు మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్ఛు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉదయం పూట నడవటం మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది రాత్రిపూట నిద్ర బాగా పట్టటానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు.
బైపాస్ సర్జరీ తర్వాత నిద్ర విషయంలో వ్యాయామం ప్రభావం మీద గతంలోనూ అధ్యయనాలు జరిగాయి. అయితే ఇది రోజువారీ పనుల నిర్వహణపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది అంచనా వేయలేకపోయాయి. అందుకే కైరో యూనివర్సిటీ పరిశోధకులు నిద్ర, రోజువారీ పనుల సామర్థ్యంపై వ్యాయామం ప్రభావం మీద దృష్టి సారించారు. కొందరికి రోజుకు 30-45 నిమిషాల సేపు ట్రెడ్‌మిల్ మీద నడవమని సూచించగా.. మరికొందరికి ట్రెడ్‌మిల్ నడకతో పాటు బరువులెత్తే వ్యాయామాలూ చేయాలని చెప్పారు.