ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హోమ్ ఐసొలేషన్... ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! - corona treatment

జలుబైనా, దగ్గొచ్చినా, కాస్త ఒళ్లు వేడిగా అనిపించినా.. అది కరోనా వల్లేనేమో అని కంగారు పడిపోతున్నాం. ఆలస్యం చేయకుండా, ముందూ వెనకా ఆలోచించకుండా కొవిడ్‌ పరీక్షా కేంద్రానికి పరుగులు పెడుతున్నాం. ఈ క్రమంలో నిజానికి మనలో వైరస్‌ లేకపోయినా అక్కడి నుంచి అంటించుకొని వచ్చే వారు ఎందరో! అంతేనా.. ఏమవుతుందో ఏమోనన్న ఆందోళనే చాలామందిని ఆస్పత్రి మెట్లు ఎక్కిస్తోంది. ఇదిగో ఇలాంటి భయమే కంటికి కనిపించని కరోనా ముందు మనల్ని బలహీనుల్ని చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా స్వల్ప లక్షణాలుంటే ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకోమని పదే పదే చెబుతున్నారు.

హోమ్ ఐసొలేషన్... ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
హోమ్ ఐసొలేషన్... ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

By

Published : May 3, 2021, 7:03 AM IST

ప్రస్తుతం దేశంలో కరోనా సునామీలా విరుచుకుపడుతోంది. అయితే రెండో దశలో ఈ మహమ్మారి తక్కువ సమయంలో ఎక్కువమందికి సోకుతున్నప్పటికీ దాదాపు 90 శాతం మందికి అసలు లక్షణాలు లేకపోవడం.. లేదంటే స్వల్ప లక్షణాలుండడం కాస్త ఊరట కలిగించే విషయం. ఇలాంటి వారిని ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోమని నిపుణులు పదే పదే చెబుతున్నారు. కానీ... తమకేమవుతుందోనన్న భయంతో చాలామంది ఆస్పత్రులకు పరుగులు తీసేసరికి అవసరం ఉన్న వారికి పడకలు, ఇతర వైద్య సౌకర్యాలు కరువవుతున్నాయి. కాబట్టి అనవసరమైన భయాల్ని పక్కన పెట్టి తక్కువ లక్షణాలున్న వారు/లక్షణాలు లేకుండా కొవిడ్‌ నిర్ధారణ అయిన వారు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూనే కొవిడ్‌ను జయించచ్చని మరోసారి సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ.

హోంఐసోలేషన్​లో ఉన్నప్పుడు

హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు..

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేని వారు, ఆక్సిజన్‌ స్థాయులు స్థిరంగా ఉన్న వారు (94-100 మధ్య నమోదైతే), జలుబు-దగ్గు-జ్వరం-ముక్కు దిబ్బడ.. వంటి తేలికపాటి లక్షణాలతో బాధపడుతోన్న వారు వైద్యుల సలహా మేరకు హోమ్‌ ఐసొలేషన్‌లోనే చికిత్స తీసుకోవడం మంచిది. ఈ క్రమంలో బాధితులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

  • ప్రత్యేకమైన గదిలో ఉంటూ మాస్క్‌ పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం/శానిటైజ్‌ చేసుకోవడం ముఖ్యం. అలాగే ఆ గదిలో గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి.
  • కొవిడ్‌ సోకిన వారు వాడిన మాస్క్‌లను సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంలో శుద్ధి చేసిన తర్వాతే పడేయాలి. అలాగే వారున్న గదిని, వాడిన వస్తువుల్ని ఇదే ద్రావణంతో శుభ్రం చేయాలి.
  • నిపుణుల సలహా మేరకు చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగాలి.
  • రోజుకు రెండుసార్లు గోరువెచ్చటి నీటితో గార్‌గ్లింగ్‌ చేయడం లేదంటే ఆవిరి పట్టడం.. వంటివి చేయాలి.
  • వైద్యులు సూచించినట్లుగా మల్టీవిటమిన్‌ మాత్రలు... జ్వరం, దగ్గు ఉన్నట్లయితే వాటిని తగ్గించే మందులు వాడాలి. అలాగే ఎప్పటికప్పుడు లక్షణాలను బట్టి ఏయే మందులు వాడాల్సి ఉంటుందో వైద్యులను సంప్రదించాలి.
  • కొవిడ్‌ బాధితులు వీలైనంత ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి.
  • మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించే వైద్యులతో నిరంతరం టచ్‌లో ఉంటూ... మీ ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు వారికి వివరించి తగిన సహాయం, సలహాలు తీసుకోవడం ముఖ్యం.
  • ఆక్సిజన్‌ స్థాయులు, శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం ఆక్సీమీటర్‌, ఇన్‌ఫ్రారెడ్‌ థర్మామీటర్‌ను మీ వద్ద ఉంచుకోవడం మంచిది.
  • నోటి ద్వారా ఎలాంటి స్టెరాయిడ్స్‌ తీసుకోకూడదు. ఏడు రోజులు దాటిన తర్వాత కూడా జ్వరం, దగ్గు ఉంటే వైద్యుల సూచనల మేరకే తక్కువ మోతాదులో వీటిని వాడాల్సి ఉంటుంది.
  • మధ్యస్థాయి/అసలు లక్షణాలు లేని వారు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ వాడడానికి వీల్లేదు. ఈ ఇంజెక్షన్‌ కేవలం ఆస్పత్రిలో చేరిన వారికి మాత్రమే ఇవ్వాలి.
  • హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న వారు కుటుంబంలోని ఇతర సభ్యులకు.. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు దూరంగా ఉండాలి.

సంరక్షకులు ఇలా!

  • కరోనా సోకిన వారిని నిరంతరం పర్యవేక్షించే సంరక్షకులు ఉండాలి.
  • కరోనా బాధితులకు ఆహారం అందించే వ్యక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఇద్దరూ ఎన్‌-95 మాస్క్‌ పెట్టుకుంటే మరీ మంచిది. ఈ క్రమంలో మాస్క్‌ పైభాగాన్ని తాకడం లేదా చేతులతో సరిచేసుకోవడం చేయకూడదు. మాస్క్‌ తడిసిపోయినా, అపరిశుభ్రంగా మారినా మార్చేయాలి. అనంతరం చేతులు శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని తాకడం మానుకోవాలి.
  • చేతులు తుడుచుకోవడానికి వాడి పడేసే టిష్యూలు ఉపయోగించాలి. ఆ వీల్లేకపోతే ప్రత్యేకంగా ఒక టవల్‌ను వాడడం మంచిది.
  • బాధితుల్ని తాకాల్సి వస్తే వాడి పడేసే చేతి తొడుగులు ఉపయోగించాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • కరోనాతో బాధపడే వారు వాడే పాత్రలు, ఇతర వస్తువుల్ని ఇంట్లో ఎవరూ వినియోగించకూడదు.

అప్పుడు కరోనా పరీక్ష అవసరం లేదు!

  • కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత కనీసం 10 రోజులకు తక్కువ కాకుండా హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండాలి. అది కూడా వరుసగా మూడు రోజులు జ్వరం, దగ్గు ఉండకూడదు.
  • హోమ్‌ ఐసొలేషన్‌ పూర్తయిన తర్వాత మరోసారి కరోనా పరీక్షలు అవసరం లేదు.
ఆస్పత్రిలో ఎప్పుడు చేరాలి

ఎప్పుడు ఆస్పత్రిలో చేరాలి ?

  • లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం చేయడం తగదు. ఎందుకంటే అప్పటిదాకా బాగానే ఉన్న వారిలో కూడా ఒకేసారి ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి.. కొన్ని తీవ్ర లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
  • ఆక్సిజన్‌ స్థాయులు 94 కంటే దిగువకు పడిపోయి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడం.
  • గత ఐదు రోజుల నుంచి తీవ్ర జ్వరం, నిరంతరాయంగా దగ్గు ఉన్నప్పుడు.. ముఖ్యంగా నిపుణుల సలహా మేరకు మందులు వాడుతున్నా తగ్గని పరిస్థితుల్లో..!
  • 60 ఏళ్లు పైబడిన వారు తమ ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటూ అత్యవసరమైతే వైద్యుల్ని సంప్రదించాలి. ఒకవేళ వీరు ఇంట్లోనే చికిత్స తీసుకోవాలనుకుంటే ముందుగానే డాక్టర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
  • డాక్టర్‌ను సంప్రదించిన మీదటే తనకున్న ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మందులను కొనసాగించాలి.
  • గుండె సంబంధిత సమస్యలున్న వారు, హైపర్‌టెన్షన్‌, కరొనరీ ఆర్టరీ డిసీజ్‌ (సీఏడీ).. తదితర అనారోగ్యాలతో బాధపడుతోన్న వారు.
  • మధుమేహం, స్థూలకాయం, ఊపిరితిత్తులు/కిడ్నీ/కాలేయ సంబంధిత వ్యాధులున్న వారు.
  • సెరెబ్రోవాస్క్యులర్‌ డిసీజ్‌ (మెదడుకు సరఫరా అయ్యే రక్తం, రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడే స్థితి).. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదిస్తే సరైన సమయంలో చికిత్స తీసుకొని వైరస్‌ నుంచి బయటపడచ్చు.
  • ఇక శ్వాసక్రియ రేటు నిమిషానికి 24, అంతకంటే ఎక్కువగా నమోదైనా, ఆక్సిజన్‌ స్థాయులు 90-93 శాతంగా నమోదైన బాధితులు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
  • శ్వాసక్రియ రేటు నిమిషానికి 30, అంతకంటే ఎక్కువగా నమోదైతే, ఆక్సిజన్‌ స్థాయులు 90 శాతం కంటే దిగువకు పడిపోతే ఐసీయూలో చికిత్స చేయాల్సి ఉంటుంది.
  • హెచ్‌ఐవీ పాజిటివ్‌, అవయవ మార్పిడి చేయించుకున్న వారు, క్యాన్సర్‌ థెరపీ తీసుకుంటున్న వారు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండడానికి అనుమతి లేదు. ఒకవేళ ఉండాల్సి వస్తే వైద్యుల సూచనలు తప్పక పాటించాలి.
ఆక్సిీమీటర్​ను ఇలా వాడాలి

ఆక్సీమీటర్‌ని ఇలా వాడాలి!

ఇంట్లో ఐసోలేట్‌ అయిన వారు ఎప్పటికప్పుడు తమ ఆక్సిజన్‌ స్థాయులు చెక్‌ చేసుకుంటూ ఉండాలని అటు నిపుణులు, ఇటు ఆరోగ్య శాఖ పదే పదే చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి దగ్గరా ఆక్సీమీటర్‌ తప్పనిసరిగా ఉండాల్సిందేనంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ. అంతేకాదు.. దీన్ని సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో సూచిస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. ఇందులో భాగంగా..

  • ముందుగా నెయిల్‌ పాలిష్‌ తొలగించాలి.. ఇప్పుడు చేతులు చల్లగా ఉంటే రెండు చేతుల్ని రాపిడి చేస్తూ కాస్త వెచ్చబరచుకోవాలి.
  • ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని.. ఆపై చేతిని ఛాతీపై పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఆక్సీమీటర్‌ని ఆన్‌ చేసి.. చూపుడు వేలు లేదంటే మధ్యవేలికి తొడగాలి.
  • ఈ క్రమంలో రీడింగ్‌లో హెచ్చుతగ్గుల్ని మనం గమనించచ్చు. అయితే కొన్ని సెకన్లలోనే రీడింగ్‌ స్థిరంగా వస్తుంది. అప్పుడు ఫలితాన్ని నమోదు చేయాలి. ఒకవేళ రీడింగ్‌ స్థిరంగా రాకపోతే ఒక నిమిషం లేదా అంతకంటే ఎక్కువ సమయం వేచి చూడచ్చు.
  • ఇలా ఐదు సెకన్ల పాటు ఏ సంఖ్యనైతే స్థిరంగా చూపిస్తుందో దాన్నే తుది రీడింగ్‌గా పరిగణించి నమోదు చేసుకోవాలి.
  • ఇలా రోజులో మూడుసార్లు నిర్ణీత వ్యవధుల్లో మీ ఆక్సిజన్‌ స్థాయులు చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరోగ్య స్థితిలో కాస్త తేడాగా అనిపించినా అప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయులు పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
  • ఈ క్రమంలో ఆక్సిజన్‌ స్థాయులు 92 శాతం కంటే తగ్గినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా, తీవ్ర అస్వస్థతకు గురైనా, విపరీతమైన అలసట వేధించినా.. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే 108/1075కు ఫోన్‌ చేసి ఆస్పత్రిలో చేరడం చాలా ఉత్తమం. తద్వారా సరైన వేళలో చికిత్స తీసుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవచ్చు.

ఇదీ చూడండి:దీదీ బం'గోల్'- 213 స్థానాల్లో టీఎంసీ పాగా

పరీక్షలు రద్దు: దీక్ష విరమించిన కేఏ పాల్

ABOUT THE AUTHOR

...view details