ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో ప్రజా రవాణాశాఖ (పీటీడీ) ఉద్యోగులుగా మారినా.. ఇప్పటివరకు వీరు ప్రభుత్వంలోని ఏయే క్యాడర్‌తో సమానమైన పోస్టుల్లో ఉన్నారనేది ఖరారు కాలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నుంచి పీఆర్సీ అమలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కానీ పీటీడీ ఉద్యోగులకు అమలు కావడంలేదు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పదేపదే కోరుతున్నప్పటికీ.. ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో పలు ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతున్నామంటూ పీటీడీ ఉద్యోగులు వాపోతున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు 2020 జనవరి ఒకటి నుంచి పీటీడీ ఉద్యోగులయ్యారు. పీఆర్సీపై నియమించిన అశుతోష్ మిశ్ర కమిషన్ సిఫార్సుల మేరకు క్యాడర్ ఖరారు చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. ఆ కమిషన్ నివేదిక కొంతకాలం కిందట బయటపెట్టారు. అందులో ఆర్టీసీలోని 115 కేటగిరీల్లో ఉన్న ఉద్యోగులను ప్రభుత్వంలోని 30 గ్రేడ్స్‌లో ఏయే పేస్కేళ్లలో చూపాలనేది సిఫార్సు చేశారు. ఆర్టీసీలో ఉండే కండక్టర్, శ్రామిక్ వంటి పోస్టులు ప్రభుత్వంలో లేనప్పటికీ వాటిని ఏ స్కేళ్లలో చూపాలో పేర్కొన్నారు. డిపో మేనేజర్ కంటే దిగువస్థాయి ఉద్యోగులకు ప్రస్తుత పేస్కేళ్ల కంటే, ప్రభుత్వ ఉద్యోగుల్లోని కొంత ఎక్కువ పేస్కేల్స్ ఉన్న క్యాడర్లలో చూపారు. డిపో మేనేజర్, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన వారికి మాత్రం ఇప్పుడున్న పేస్కేళ్ల కంటే కొంత తగ్గనుంది. అంటే దాదాపు 48 వేల మంది ఉద్యోగులకు పీఆర్సీతో మేలు కలగనుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ క్యాడర్ ఖరారుపై ఉత్తర్వులు ఇవ్వలేదు.