Pranahitha Pushkaralu 2022: తెలంగాణలోని ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట వద్ద పుష్కరాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు. తుమ్మిడిహెట్టి వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ కోవా లక్ష్మి ప్రారంభించారు. అర్జునగుట్ట ఘాట్ వద్ద పుణ్య స్నానాలకు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి 24 వరకు తెలంగాణ, మహారాష్ట్రలలో ప్రాణహిత నది పుష్కరాలను నిర్వహించనున్నారు. కిందటిసారి 2010 డిసెంబరులో నిర్వహించగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ పుష్కర కళ వచ్చింది. రెండు రాష్ట్రాల్లో రోజూ 2 లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని అంచనా.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండల కేంద్రం, కోటపల్లి మండలంలో అర్జునగుట్ట వద్ద, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద, మహారాష్ట్రలోని సిరోంచ, నగరం వద్ద పుష్కరఘాట్లను సిద్ధం చేశారు. భక్తులు మాత్రం పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాట్లు సరిగ్గాలేవని వాపోతున్నారు.