ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

pranahitha pushkaralu: నేటి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు - Pranahita pushkars

pranahitha pushkaralu: నేటి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో ప్రాణహిత పుష్కరాలు జరిగితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ పుష్కరాలను తెరాస ప్రభుత్వం నిర్వహిస్తోంది. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రోజుకు సుమారు 2 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

pranahitha pushkaralu
pranahitha pushkaralu

By

Published : Apr 13, 2022, 5:50 AM IST

pranahitha pushkaralu: పుష్కర స్నానం ఎంతో పుణ్యఫలమని.. సర్వ పాపాలను హరిస్తుందనేది భక్తుల విశ్వాసం. అందుకే పుష్కరాలు జరిగే నదిలో స్నానాలు ఆచరించి.. సమీపంలోని ఆలయాలను దర్శించుకుంటారు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కర శోభ వస్తుంది. 12 ఏళ్లకోసారి పుష్కర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు ప్రాణహిత నదికి పుష్కరాలు జరగనున్నాయి. తెలంగాణలోని కుమురం భీం జిల్లాలోని తుమ్మిడిహెట్టి నుంచి ప్రారంభమయ్యే ప్రాణహిత నది మంచిర్యాల జిల్లా మీదుగా సుమారు 113 కిలోమీటర్లు ప్రవహించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయం సమీపంలోని గోదావరిలో కలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 3:50 నిమిషాలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ దంపతులు ఈ పుష్కరాలను ప్రారంభించనున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం, త్రివేణి సంగమం వద్ద ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం స్నాన ఘట్టాలు సిద్ధం చేశారు. తాగునీటి వసతి కల్పించారు. మరుగుదొడ్లు నిర్మించారు. బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ఎండ తగలకుండా చలువ పందిళ్లు వేశారు. కాళేశ్వరం వద్ద వీఐపీలు, సాధారణ భక్తుల కోసం రెండు ఘాట్లు సిద్ధం చేశారు. నీటిలో ప్రమాదాలు జరగకుండా 60 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.

విస్తృత ప్రచారం కల్పించాలి..

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టితో పాటు వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లా దేవులవాడ సమీపంలోని పుష్కరఘాట్‌ను సందర్శించిన కలెక్టర్‌ భారతీ హోలీకేరీ.. పలు సూచనలు చేశారు. ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల అర్జునగుట్ట, వేమనపల్లి ఘాట్ల వద్ద తాత్కాలిక ఏర్పాట్ల కోసం దేవాదాయశాఖ రూ.10 లక్షల నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం మరిన్ని ఏర్పాట్లు చేసి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.

భక్తుల నుంచి అసంతృప్తి..

పుష్కరాలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ.. భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. తూతూ మంత్రంగానే సౌకర్యాలు కల్పించారనే వాదనలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తే ఇబ్బందులు తప్పవని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి:రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇకపై బియ్యం వద్దంటే డబ్బులు!

ABOUT THE AUTHOR

...view details