రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో.. రాజధానిగా అమరావతే ఉండాలని ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. గుంటూరు సహా ఉండవల్లిలో శనివారం ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఉండవల్లిలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో రాజధాని అమరావతికి అనుకూలంగా 1632 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గుంటూరులో నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 4,211 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అమరావతికి అనుకూలగా 4,193 ఓట్లు రాగా.. మూడు రాజధానుల ప్రతిపాదనకు కేవలం 16 ఓట్లు మాత్రమే అనుకూలంగా పడ్డాయి.
గుంటూరులో జరిగిన ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని గుర్తెరిగి ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి పుల్లారావు సూచించారు. ప్రజలంతా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారనే విషయం ప్రభుత్వానికి తెలియజేసేందుకే ప్రజా బ్యాలెట్ నిర్వహించినట్లు ఐకాస నేతలు తెలియజేశారు. 13 జిల్లాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని మార్చాలనుకోవడం సబబు కాదన్నారు.