ఈ ఏడాదిలో 3 నెలల పాటు సింగరేణి నుంచి బొగ్గును తీసుకోకపోగా(coal crisis in ap).. జెన్‌కో యూనిట్ల నుంచి వచ్చే యూనిట్ ధర కన్నా బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉండటం(power shortage in state)తో యూనిట్లను బ్యాక్‌డౌన్‌లో ఉంచారు. ఉత్పత్తిలో లేకపోవటంతో అనవసరంగా బొగ్గు నిల్వలు ఎందుకనే కోణంలో అధికారులు ఆలోచించారు. సింగరేణి, మహానది కోల్ ఫీల్డు బకాయిలూ భారీగానే ఉండగా.. బొగ్గు నిల్వలపై అధికారులు దృష్టి సారించలేదు. 2020-21 వేసవిలో వచ్చే విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జెన్‌కో ప్లాంట్ల దగ్గర సుమారు 16 లక్షల టన్నులను నిల్వ చేశారు. లాక్‌డౌన్‌లో డిమాండ్ 130 మిలియన్ యూనిట్లకు పడిపోగా.. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే చౌక విద్యుత్‌ను డిస్కంలు తీసుకున్నాయి. జెన్‌కో ప్లాంట్లను బ్యాక్‌డౌన్ చేయడంతో దాదాపు ఏడాదిగా అక్కడ ఉన్న బొగ్గు వృథాగా పడి ఉంది. దాంతో సింగరేణి నుంచి మూడు నెలల పాటు బొగ్గును తీసుకోలేదు.
రంగంలోకి కేంద్రం...
గత కొంతకాలంగా విద్యుత్‌కు ఊహించని విధంగా డిమాండ్ పెరిగింది. బొగ్గు కొరత కారణంగా దాదాపు 50 శాతం యూనిట్లను మూసేయాల్సి వచ్చిందని ఒక అధికారి తెలిపారు. మరోవైపు ఆయా ఉత్పత్తి సంస్థలకు 600 కోట్ల వరకు జెన్‌కో బకాయి పడి ఉంది. ప్రస్తుతం రంగంలోకి దిగిన కేంద్రం.. బకాయిలతో సంబంధం లేకుండా థర్మల్ ప్లాంట్ల దగ్గర ఉన్న బొగ్గు నిల్వల ఆధారంగా సరఫరా చేయాలని ఉత్పత్తి సంస్థలను ఆదేశించింది. 15 రోజుల వరకు బొగ్గు నిల్వ ఉన్న వాటికి సరఫరా నిలిపివేసి 5-10 రోజులు ఉన్నవాటికి ఉత్పత్తికి అనుగుణంగా, 5 రోజుల కన్నా తక్కువ నిల్వలు ఉన్నవాటికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో నాలుగైదు రోజుల్లో దఫాలవారీగా సుమారు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు రాష్ట్రానికి రానుంది.