ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Power cuts in hospitals: అంధకారంలో ఆస్పత్రులు...చీకట్లో ప్రసవ వేదన - ఏపీ లేటెస్ట్​ అప్​డేట్స్

Power problems in hospitals: విద్యుత్‌ కోతలతో రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వాస్పత్రులు గాఢాంధకారంలో మగ్గుతున్నాయి. సెల్‌ఫోన్‌ లైట్ల మధ్య రోగులకు వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయి. శస్త్రచికిత్సల నిర్వహణపైనా విద్యుత్తు కోతల ప్రభావం కనిపిస్తోంది. ఉక్కపోత భరించలేక... దోమల బాధ తట్టుకోలేక ఇన్‌పేషెంట్లు అల్లాడిపోతున్నారు. రోగులు, వారి సహాయకుల చేతుల్లో విసనకర్రలు కనిపిస్తున్నాయి.

Power problems in hospitals
అంధకారంలో ఆస్పత్రులు...చీకట్లో ప్రసవ వేదన

By

Published : Apr 9, 2022, 11:18 AM IST

Power problems in hospitals: రాష్ట్రంలో 1,100 వరకు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటల ఆస్పత్రులుగా మార్చారు. వీటిలో చాలాచోట్ల జనరేటర్లు లేవు. కొన్నిచోట్ల ఉన్నా... మరమ్మతుల కారణంగా పనిచేయట్లేదు. అత్యవసర సమయాల్లో ఇక్కడ ప్రసవాలు చేయాలి. కానీ విద్యుత్తు కోతలతో ఉక్కపోత భరించలేక రోగులు, వీరికి చికిత్స అందించలేక వైద్యసిబ్బంది సతమతమవుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ సీహెచ్‌సీలో జనరేటర్‌ ఉన్నా.. పనిచేయడంలేదు. శస్త్రచికిత్సలు తగ్గడంతో ఇన్‌పేషెంట్లుగా చేరేందుకు రోగులు రావట్లేదు. జనరేటర్‌కు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సురేష్‌ తెలిపారు.

ఉక్కపోతతో ఆస్పత్రిలోనే

Power problems in hospitals: జిల్లా కేంద్రమైన బాపట్లలోని ప్రాంతీయ వైద్యశాలలో విద్యుత్తు కోత కారణంగా తరచూ అంధకారం నెలకొంటోంది. జనరేటర్‌ ఉన్నా.. డీజిల్‌ లేదు. పగటివేళ కూడా విద్యుత్తు కోతలతో శస్త్రచికిత్సలకు ఇబ్బంది కలుగుతోంది. ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ నిధులను ప్రభుత్వానికి జమ చేయగా ఇంతవరకూ తిరిగి రాలేదు. దీనివల్ల జనరేటర్ల మరమ్మతులకు, డీజిల్‌ కొనుగోలుకు ఆస్పత్రుల సూపరింటెండెంట్లు సొంత డబ్బు వెచ్చిస్తున్నారు. కొన్నిచోట్ల ఇదీ జరగడంలేదు.

సరిపోని ఇన్వర్టర్ల సామర్థ్యం:విజయనగరం జిల్లావ్యాప్తంగా విద్యుత్తు కోతలతో ఆస్పత్రులలో రోగులకు ఇక్కట్లు తప్పడంలేదు. ప్రాంతీయ ఆస్పత్రుల్లో జనరేటర్లు ఉన్నా డీజిల్‌ కొనుగోలుకు నిధుల్లేక కొన్నిచోట్ల మూలపెట్టారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇన్వర్టర్లు ఉన్నా వాటి సామర్థ్యం చాలట్లేదు. రాజాం ప్రాంతీయ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌, ఇతర అధికారులు సొంత డబ్బులతో డీజిల్‌ కొంటున్నారు. చీపురుపల్లి సామాజిక ఆస్పత్రిలో ఇన్వర్టరు సదుపాయాన్ని లైట్లకే పరిమితం చేశారు.

చీకట్లోనే మహిళల ప్రసవవేదన

కొత్త జనరేటర్‌ ఉన్నా..:చిత్తూరు జిల్లాలో పీహెచ్‌సీలతో పాటు వి.కోట సీహెచ్‌సీలో విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడ ప్రసవాలు ఎక్కువగా జరుగుతుంటాయి. మార్చి చివరి వారం నుంచి ఈ ఆస్పత్రిలో విద్యుత్తు కోతలు తీవ్రంగా ఉన్నాయి. జనరేటర్‌ ఉన్నా పనిచేయట్లేదని రోగులు వాపోతున్నారు. గాలి కోసం విసనకర్రలతో కుస్తీ పడుతున్నారు. ఇక్కడ కొత్త జనరేటర్‌ తీసుకొచ్చినా... అది బిగించలేదు. రోజులో 4-5 గంటలు కరెంటు కోతలు ఉంటున్నాయి. బైరెడ్డిపల్లె మండలం పీహెచ్‌సీలో 4 గంటలు కోత ఉంటోంది. ఇక్కడ జనరేటర్‌ లేదు. యూపీఎస్‌తోనే పని నడిపిస్తున్నారు.

డొక్కు జనరేటర్‌తో తిప్పలు:కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతీయ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లపై విద్యుత్తు కోతల ప్రభావం తీవ్రంగా ఉంది. రోజూ ఉదయం 11 తర్వాత సుమారు 5 గంటలపాటు విద్యుత్తు కోత ఉంటున్నందున ఓపీ సహా సేవలన్నింటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు సకాలంలో జరగడంలేదు. జనరేటర్‌ ఉన్నా.. అది బాగా పాతది కావడంతో గœంటకు 30 లీటర్ల ఇంధనం ఖర్చవుతోంది. ఆస్పత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రంలో నిత్యం శస్త్రచికిత్సల కోసం కనీసం 30-50 యూనిట్ల రక్తం నిల్వ ఉంచుతున్నారు. రక్తం పాడవ్వకూడదంటే.. ఉష్ణోగ్రత పది డిగ్రీల లోపే ఉండాలి. నిరంతరం విద్యుత్తు ఉండేలా చూడాలంటూ డీఈకి లేఖ రాసినట్టు సూపరింటెండెంట్‌ ఎస్‌.ఇందిరాదేవి తెలిపారు.

కరెంటు లేక ఉక్కపోతతో ఆరుబయట సేద తీరుతున్న రోగులు
  • కృష్ణా జిల్లా పెనమలూరు పీహెచ్‌సీలో జనరేటర్‌ లేనందున విద్యుత్తు కోత సమయంలో కుటుంబ నియంత్రణ శస్త్రచిక్సిలు నిలిపేశారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట సీహెచ్‌సీలో జనరేటర్‌ ఉన్నా పాడైపోయింది. నందిగామ సీహెచ్‌సీలో 50 పడకలు ఉన్నాయి. జనరేటర్‌ ఉన్నా.. డీజిల్‌కు నిధులు లేక అత్యవసరమైతేనే పరిమితంగా వినియోగిస్తున్నారు.

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల వినియోగం:నెల్లూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 7-8 గంటలు, పట్టణాల్లో 1-2 గంటల మేర విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. కావలి ప్రాంతీయ ఆస్పత్రిలో రోజుకు 200-300 ఓపీ ఉంటుంది. ప్రస్తుతం కరెంటు కోతలతో ఇన్‌పేషెంట్లు ఇక్కట్లు పడుతున్నారు. గదిలో ఉక్కపోత భరించలేక.. చెట్ల కింద సేద తీరుతున్నారు. జనరేటర్‌ ఉన్నా.. సరిగా పనిచేయడం లేదు. ఆస్పత్రిలోని రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు కోతలతో పనిచేయకపోవడంతో.. శస్త్రచికిత్సల సమయంలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వినియోగిస్తున్నారు.

కరెంటు లేక శిశువుకు గాలి విసురుతున్న తల్లి

కర్నూలు జిల్లాలో..:కర్నూలు జిల్లాలోని కోసిగి, గోనెగండ్ల, బేతంచెర్ల పీహెచ్‌సీలలో ప్రసవాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎమ్మిగనూరు, డోన్‌, పత్తికొండ, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లి సీహెచ్‌సీలలోనూ ప్రసవాల సంఖ్య అధికమే. అన్ని 24 గంటల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు జనరేటర్లు.. ఇన్వర్టర్లు ఉండగా కొన్ని పీహెచ్‌సీలకు ఎనిమిదేళ్ల కిందటే ఇన్వర్టర్లు ఇచ్చారు. కొన్ని పీహెచ్‌సీలలో జనరేటర్లు, ఇన్వర్టర్లు మరమ్మతులకు గురికావడంతో మూల పడేశారు. జిల్లావ్యాప్తంగా 50% ఇన్వర్టర్లు, జనరేటర్లు పనిచేయడం లేదు.

  • ఆస్పరి పీహెచ్‌సీలో గురువారం రాత్రి 10 గంటలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో కాన్పు కోసం ఆశా కార్యకర్త ఓ గర్భిణిని 108లో తీసుకొచ్చారు. విద్యుత్తు సరఫరా లేక.. చికిత్స అంతా సెల్‌ఫోన్‌ వెలుతురులోనే జరిగింది. ఆస్పత్రిలో ఇన్వర్టర్‌ ఉన్నా.. ప్రసవాల గదిలో ఉపయోగించేందుకు వీల్లేని పరిస్థితి.

ఛార్జింగ్‌ లైటు వెలుగులో పురుడు:మాడుగుల, దేవరాపల్లి, చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: కరెంటు కోతలు ఆసుపత్రులకు వచ్చే వారిని కన్నీళ్లుపెట్టిస్తూ, సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టార్చిలైట్ల వెలుగులో ప్రసవం మరువకముందే.. ఇదే జిల్లా మాడుగులలో అలాంటి ఘటన మరోటి వెలుగుచూసింది. పాడేరు మండలం రావిపాలెం గ్రామానికి చెందిన పోతురాజు ఈనెల 6న రాత్రి 2 గంటలకు పురిటినొప్పులతో బాధపడుతున్న తన భార్య లక్ష్మిని మాడుగుల 30 పడకల ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే కరెంటు పోయి చీకట్లో ఉన్న సిబ్బంది ప్రసవ వేదనతో వచ్చిన మహిళకు సెల్‌ఫోన్లు, ఛార్జింగ్‌ లైట్ల వెలుగులో ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆసుపత్రికి జనరేటర్‌, ఇన్వర్టర్‌ లేకపోవడం గమనార్హం.

  • విశాఖ జిల్లా దేవరాపల్లి ఆసుపత్రిలో జనరేటర్‌ ఉన్నా డీజిల్‌ పోయడం లేదు. ఇన్వర్టర్‌ కేవలం 2 గదులకే సరిపోతోంది. ఇటీవల విద్యుత్తు కోతల వల్ల పిల్లలకు అట్టలతో విసరలేకపోతున్నామని వార్డుల్లోని బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  • పల్నాడు జిల్లా చిలకలూరిపేట చీరాల రోడ్డులో 30 పడకల ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజు 150 మంది రోగులు వస్తుంటారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్తు కోతలు పెడుతుండటంతో పగలు ఉక్కపోత, రాత్రి అంధకారం, దోమల సమస్యతో రోగులు అల్లాడుతున్నారు. శిశవులు, బాలింతల కోసం అట్ట ముక్కలు ఇచ్చి విద్యుత్తు లేని సమయంలో విసురుకోమని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇక్కడ జనరేటర్‌ ఉన్నా పని చేయడం లేదు. ఆసుపత్రి ప్రాంగణంలోని స్తంభాలకూ దీపాలు లేవు.

విసనకర్రలతో...:శ్రీకాకుళం జిల్లా పలాస సామాజిక ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా ఉన్న బాలింతలు, రోగుల పరిస్థితి వర్ణనాతీతం. విద్యుత్తు కోతలతో.. గాలి కోసం వారు విసనకర్రలతో కుస్తీపడుతున్నారు. ఉన్న ఒక జనరేటర్‌ను ఆక్సిజన్‌ ప్లాంటుకు పెట్టడంతో ప్రతి వార్డులో ఒక్కో బల్బు మాత్రమే వెలుగుతోంది. ఫ్యాన్లు తిరగట్లేదు.

బాలింతలకు విసర కర్రలతో గాలి విసురుతున్న బంధువులు

చీకట్లో ప్రసవ వేదన:కర్నూలు జిల్లా పత్తికొండ సీహెచ్‌సీలో గురువారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు ఇబ్బందులు పడ్డారు. కళ్లు తెరవని పసికందులతో చీకట్లో ఫ్యాన్లు తిరగక, గాలి ఆడక, ఉక్కపోతతో బాలింతలు విలవిల్లాడిపోయారు. రాత్రి నలుగురికి టార్చిలైటు వెలుగులో ప్రసవాలు చేయాల్సి వచ్చింది. దీంతో గర్భిణుల బంధువులు, ఆస్పత్రి సిబ్బంది హైరానా పడ్డారు. లోపల ఎవరు ఎవరికి వైద్యం చేస్తున్నారో.. బిడ్డల పరిస్థితి ఏంటో అర్థం కాక గర్భిణుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరెంటు లేక ఫ్యాను తిరగక బిడ్డకు గాలి విసురుతున్న బాలింత
ఇదీ చదవండి:రాష్ట్రంలో తారాస్థాయికి చేరిన కరెంటు కష్టాలు.. మనకే ఎందుకీ కోత?

ABOUT THE AUTHOR

...view details