ఐటీ శాఖ ఉద్యోగుల కోసం.. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్‌ల పేరిట కల్పించనున్న ప్రత్యేక మౌలిక సదుపాయాల కోసం..యూపీఎస్లు, జనరేటర్ల బ్యాకప్ పెట్టుకోవాలని ఐటీ శాఖ నిర్ణయించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్‌పై సమీక్షించిన ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి.. రాష్ట్రంలో కరెంటు కోతల దృష్ట్యా యూపీఎస్లు, జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలంటూ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 29 కళాశాలల్లో ఐటీ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ కార్యక్రమంలో భాగంగా.. ఐటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు 1వ తేదీ నాటికి కొన్ని కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు పేర్కొంది. డిసెంబరు 24 నాటికల్లా అన్ని కేంద్రాల్లోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ సౌకర్యాలను కల్పించనున్నట్టు స్పష్టం చేసింది.
POWER ISSUE: వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ విధానానికీ విద్యుత్ కష్టాలు! - power_issues_in_work_from_home_town_project
ఐటీ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పైలట్ ప్రాజెక్టుకీ.. విద్యుత్ కష్టాలు తప్పేలా లేవు. యూపీఎస్, జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంక్షోభం తాత్కాలికమేనని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి గౌతంరెడ్డి సూచించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ల విషయంలో అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ సంస్థల నుంచి ఎక్కువ అవకాశాలు వచ్చేలా బ్రాండింగ్ చేసుకోవాలని ఐటీ శాఖ భావిస్తోంది. వేర్వేరు నగరాల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులు.. తమ ప్రాంతాల నుంచే పనిచేసేలా మౌలిక సదుపాయాలను, హైస్పీడ్ ఇంటర్నెట్ కల్పించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ పేరిట ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేక కార్యాలయ స్థలాలను ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా 29 చోట్ల ఈ తరహా సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే దిల్లీకి వెళ్లి.. కేంద్ర ఐటీ శాఖ మంత్రికి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కాన్సెప్ట్ వివరిస్తానని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ అవసరమని.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: DRUGS: విశాఖ కేంద్రంగా.. ద్రవరూపంలో గంజాయి తయారుచేస్తున్న ముఠాలు