ఇంధన వ్యయ సర్దుబాటు(ట్రూఅప్) కింద వినియోగదారుల నుంచి రూ.17 వేల కోట్లు వసూలు చేయాలన్న డిస్కంల యోచన విద్యుత్తు వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. ఇప్పటికే శ్లాబ్‌లు మారి విద్యుత్తు ఛార్జీలు భారంగా మారాయని భావిస్తున్న వారికి తాజా పరిణామం గుబులు పుట్టిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాన్ని ట్రూఅప్ పేరుతో తర్వాతి ఏడాదిలో భర్తీ కోసం డిస్కంలు ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదిస్తాయి. ఇందులో కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఎంత మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయాలనే విషయాన్ని ఏపీఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. 2014-15 నుంచి 2018-19 మధ్య విద్యుత్తు కొనుగోలు వ్యయం.. ఇతర ఖర్చుల వివరాలను డిస్కంలు అందించాయి. అయిదేళ్ల నష్టాలను రూ.17 వేల కోట్లుగా తమ ప్రతిపాదనల్లో డిస్కంలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి దీనిపై విచారణను జులై 8వ తేదీకి ఈఆర్‌సీ వాయిదా వేసింది. నష్టాలను తగ్గించుకోవటానికి ప్రస్తుత ప్రతిపాదనల్లో కొంత వరకైనా అనుమతిస్తుందన్న ఆశతో డిస్కంలు ఉన్నాయి. వసూలుకు అనుమతిస్తే వినియోగదారులపై ప్రతినెలా భారం పడే అవకాశం ఉంది.
నిర్ణయంపై ఉత్కంఠ
ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు పేదల నుంచి దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన అనేక మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు.ఈ తరుణంలో డిస్కంలు తమకు వస్తున్న నష్టాలను తగ్గించుకోవడానికి వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. గడచిన అయిదేళ్లుగా డిస్కంలు చేస్తున్న ప్రతిపాదనలను ఈఆర్‌సీ తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఈ దఫా ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.