జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడైన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. బెయిలు షరతులను ఉల్లంఘిస్తూ, సాక్షులను ప్రభావితం చేస్తున్న విజయసాయిరెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. వాదనలకు సమయం చాలనందున ఇరుపక్షాలు గడువు కోరాయి. దీంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై మొదట విచారణ చేపట్టవచ్చంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థిస్తూ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్ల పిటిషన్లను కొట్టివేసిన విషయం విదితమే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నామని, అప్పటివరకు ఈడీ కేసులపై విచారణను వాయిదా వేయాలని సోమవారం నాటి విచారణలో విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది ఎన్.నవీన్‌కుమార్ కోర్టును కోరారు. దీంతో ఈడీ కేసుల విచారణను కోర్టు సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.
సబితపై అభియోగాలను నమోదు చేయండి
తనను కేసు నుంచి తొలగించాలంటూ తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. ఐటీ శాఖ మంత్రిగా ఇందూ టెక్ జోన్ ప్రాజెక్టు కేటాయింపులో సబిత కీలకపాత్ర పోషించారని పేర్కొంది. వాస్తవాలు విచారణలో వెల్లడవుతాయని, అందువల్ల సబిత పిటిషన్‌ను కొట్టివేసి అభియోగాలను నమోదు చేయాలని కోరింది. దీంతో సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. పెన్నా కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ వేసిన డిశ్చార్జి పిటిషన్‌పై కౌంటరు వేయడానికి సీబీఐ మరోసారి గడువు కోరడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
రాఖీ రోజు విషాదం.. అక్క మరణాన్ని తట్టుకో లేక తమ్ముడు మృతి..