మూఢం వెళ్లిపోయింది.. కానీ మహమ్మారి ఇక్కడే తిష్ఠవేసింది. ముహూర్తాలు వచ్చేశాయి. కానీ కరోనా వాటికంటే ముందే వచ్చేసింది. చలువ పందిళ్లు... మామిడాకుల తోరణాలు... చేతులకు గోరింటాకులు... బాజా భజంత్రీలు... ఇవేవీ ఇప్పట్లో కనిపించేలా లేవు. ఇంట్లో పెళ్లికళ వస్తుందని ఎదురుచూస్తున్న వారంతా హతాశులవుతున్నారు. పెళ్లిళ్లు కుదుర్చుకుని ఇప్పటికే వివాహ వేదికలు సిద్ధం చేసుకున్నవారు అయోమయంలో ఉన్నారు. కరోనా రెండోదశ కేసులు పెరిగిపోతూ ప్రమాదకర వాతావరణం ఏర్పడటంతో శుభకార్యాలకు అనిశ్చితి ఏర్పడింది.
మే, జూన్ నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో పెళ్లిళ్లున్నాయి. మరోవైపు గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, ఆలయాల ప్రతిష్ఠలు ఇలా ఎన్నో కార్యక్రమాలు అనిశ్చితిలో ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. శుభకార్యాలపై ఆధారపడ్డ రూ. వందల కోట్ల వ్యాపారం, వీటిపై ఆధారపడిన వాళ్లంతా మళ్లీ ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 30తో మూఢం వెళ్లిపోయింది. ఆ తర్వాత మూడు రోజులు ముహూర్తాలు లేవు. ఆ తర్వాత నుంచి ముహూర్తాలు ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పురోహితులు సుదర్శనం వేంకట జనార్ధనాచార్యులు చెప్పారు. మధ్యలో కొన్నిరోజులు కత్తెర ఉన్నా జులై 12 వరకు ముహూర్తాలు ఉన్నాయన్నారు. ఈనెల 13, 26, 29, జులై 4 చాలా బలమైన ముహూర్తాలని.. ఆ రోజుల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
కింకర్తవ్యం..?
ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకుని మూహూర్తాలు నిర్ణయించుకుని వేదికలకు అడ్వాన్సులు ఇచ్చినవారు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లకు ప్రభుత్వాలు ఏ స్థాయిలో అనుమతిస్తాయో అర్థం కావడం లేదని అనేక మంది వాపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఒక రైతు కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల పిల్లలకు ఈనెల 23, 29 తేదీల్లో పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. ఒకటి భీమవరంలో, మరొకటి హైదరాబాద్‌లో అనుకుని... భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదని వారు చెబుతున్నారు. ఆ సమయానికి కరోనా తగ్గుతుందా, ఇంకా పెరుగుతుందా అన్న ఆందోళనతో ఉన్నారు. కిందటి ఏడాది నవంబరులో పెళ్లిళ్లు కొంతవరకు ఇబ్బందులు లేకుండా జరిగాయి. తర్వాత మూఢం వచ్చి అన్నీ ఆగిపోయాయి. మూఢం వెళ్లాక చేద్దామని.. కొందరు తల్లిదండ్రులు మే నెలకు తమ పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అంతకుమించి మరీ ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. స్థానికంగా జరిగే పెళ్లిళ్లు తక్కువ మంది అతిథులతో జరిగిపోతాయని, అమెరికా సంబంధాల విషయంలోనే బాగా ఇబ్బంది ఉందని, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నవారు వాయిదా వేసుకుంటున్నారని రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు కుదిర్చే ఒక మ్యారేజి బ్యూరోలో సేవలందించే స్రవంతి ‘ఈనాడు’కు చెప్పారు. ఆ పెళ్లిళ్ల విషయంలో సందిగ్ధత ఉందన్నారు.