ఇంటర్ మొదటి ఏడాది తరగతుల పునఃప్రారంభం వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా.. వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఒక్కో సెక్షన్‌కు అనుమతించే విద్యార్థుల సంఖ్యను 88 నుంచి 40కి తగ్గించడాన్ని ప్రైవేటు యాజమాన్యాలు కోర్టులో సవాలు చేశాయి. దీంతో ఆన్‌లైన్ ప్రవేశాల్లో జాప్యం నెలకొంది. ఈ నేపథ్యంలో తరగతుల పునఃప్రారంభం వాయిదా పడింది.
వెబ్‌సైట్‌లో దోబూచులాట
ఆన్‌లైన్ ప్రవేశాల సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఇష్టారాజ్యంగా పెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. కాసేపు ప్రవేశాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పెట్టి, ఆ తర్వాత ఆ సందేశాన్ని తొలగిస్తున్నారు. నిలిపివేసినట్లు సమాచారం పెట్టినా వెబ్‌సైట్ యథావిధిగానే పనిచేస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ ప్రవేశాలకు ఇప్పటివరకు సుమారు 3లక్షల మంది ఐచ్ఛికాలను ఇచ్చారు. ఇంటర్‌లో ఏటా 5లక్షల మందికి పైగా చేరుతారు. ఈ లెక్కన మరో రెండు లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌కు దూరంగానే ఉన్నారు.