తెలంగాణలో కొత్త తరహా సేవలు అందించే దిశగా తపాలాశాఖ ముందుకు సాగుతోంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు కోరుకునే సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ.. బ్యాంకింగ్ రంగంతో పోటీ పడేందుకు యత్నిస్తోంది. క్షేత్ర స్థాయిలో గ్రామాల వరకు తపాలా శాఖ విస్తరించి ఉండడంతో.. కొత్తరకం సేవలు ఏవైనా త్వరితగతిన ఆకలింపు చేసుకుని ప్రజలకు చేరువగా తీసుకెళ్లగలుగుతోంది.
బ్యాంకింగ్ రంగం మాదిరిగా ప్రజల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం, అవసరమైనప్పుడు వారి ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడం, జీవిత బీమా, రికవరింగ్ డిపాజిట్లు సేకరించడం, ఏటీఎంల సేవలు అందుబాటులోకి తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బాలిక సాధికారిత కార్యక్రమంలో భాగంగా సుకన్య సంవృద్ధి యోజన పథకం వంటి సేవలు అందిస్తోంది. వాటితోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆధార్, పాస్ పోర్టు సేవలను కూడా తపాలాశాఖ సమర్థవంతంగా అందిస్తోంది.
తెలంగాణలో 45 గ్రామాలను ప్రత్యేకంగా ఎంచుకుని వందశాతం సుకన్య సంవృద్ధియోజన, మరో 25 గ్రామాల్లో వందశాతం జీవితబీమాను తపాలా శాఖ అమలు చేస్తోంది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి జనంలో చైతన్యం తీసుకొచ్చి ఆయా పథకాలు సమర్ధవంతంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. 45 గ్రామల్లో పది సంవత్సరాలలోపు వయసున్న ఆడపిల్లల పేరున 7,149 ఎస్‌ఎస్‌ఏ ఖాతాలను తెరిపించగా, సేవింగ్స్ ఖాతాలు, రికవరింగ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లకు చెందిన మరో 9,523 ఖాతాలను తెరిపించినట్లు పోస్టు మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి వివరించారు. 25 గ్రామల్లో వందశాతం జీవితబీమా చేయించడంలో భాగంగా.. 5,164 మంది ఈ పథకంలో భాగస్వామ్యులయ్యారని ఆయన తెలిపారు.