Power Grid: రాష్ట్ర విద్యుత్ సంస్థల తీరుతో జాతీయ గ్రిడ్ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పొసోకో (పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్) హెచ్చరించింది. జాతీయ గ్రిడ్ నుంచి అనుమతించిన దానికంటే ఎక్కువ విద్యుత్‌ను రెండు రోజులుగా తీసుకుంటున్నాయని పేర్కొంది. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌కు పొసోకో లేఖ రాసింది. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయటానికి తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.
లేఖలో ‘రాష్ట్ర విద్యుత్ సంస్థలు రెండురోజులుగా నిర్దేశించిన లోడ్ కంటే ఎక్కువ విద్యుత్‌ను జాతీయ గ్రిడ్ నుంచి తీసుకుంటున్నాయి. 3వ తేదీన 1,565 మెగావాట్లు, 4వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు 1,485 మెగావాట్లు ఎక్కువ విద్యుత్‌ను తీసుకున్నాయి. ఇదే విషయాన్ని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఆర్‌ఎల్‌డీసీ) తెలిపింది. దీనివల్ల జాతీయ గ్రిడ్ ప్రమాదంలో పడుతుందన్న విషయాన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని తక్షణం సరిచేసుకోవాలి’ అని పేర్కొంది.