ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Badvel bypoll: ముగిసిన బద్వేలు ఉపఎన్నిక పోలింగ్‌..

Badvel bypoll
Badvel bypoll

By

Published : Oct 30, 2021, 7:01 PM IST

Updated : Oct 30, 2021, 8:35 PM IST

18:51 October 30

చెదురుమదురు ఘటనల మినహా బద్వేలు ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. కొన్నిచోట్ల దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన బయటి వ్యక్తులను స్థానికులు పట్టుకున్నారు. భాజపా ఏజెంట్లను భయపెట్టారంటూ ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బద్వేలు ఉపఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా  ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 7 గంటలకు ముగిసింది.  వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు  పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో 76.37 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం  68.12గా నమోదైంది. వచ్చే నెల 2న ఉప ఎన్నికల ఫలితం వెలువడనుంది.

పోలింగ్ కేంద్రాల వద్దకు బయటి వ్యక్తులు..
కొన్నిచోట్ల బయటి వ్యక్తులు పోలింగ్‌ కేంద్రాల వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అట్లూరు పోలింగ్ కేంద్రంలో గుర్తుంపుకార్డులు లేనివారిని  వెనక్కి పంపారు. ఎస్ వెంకటాపురంలో భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బయటి వ్యక్తులు ఓటు వేసేందుకు వచ్చారంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో పోలీసులు వారిని తిప్పిపంపారు.  ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారికి సర్దిచెప్పారు. ఎస్ వెంకటాపురం కేంద్రాన్ని వైకాపా అభ్యర్థి సుధా, భాజపా అభ్యర్థి సురేశ్‌ సందర్శించారు.

రీపోలింగ్​కు భాజపా డిమాండ్..
వరికుంట్లలో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన కొందరిని ఆ పార్టీ నేతలు గుర్తించారు. 30 మంది మహిళలను పోలీసులకు అప్పగించారు. దీంతో నిరసన చేపట్టిన ఆ పార్టీ నేతలు.. వరికుంట్లలో రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఎస్పీకి సోము వీర్రాజు ఫిర్యాదు..
భాజపా ఏజెంట్లను పోలీసులు బెదిరించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. ఈమేరకు కడప ఎస్పీ అన్బురాజన్‌కు  ఫిర్యాదు చేశారు. గోపవరం మండలం బుట్టాయిపల్లి, జోగిరెడ్డిపల్లిలో తమ ఏజెంట్లను బెదిరిస్తున్నారని.. ఎన్నికల పరిశీలకుడికి  సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. తిరువెంగళాపురం పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. పోరుమామిళ్లలో బయటి వ్యక్తులు మోహరించారని ఎస్పీ అన్బురాజన్ కి చేసిన ఫిర్యాదులో.. సోము వీర్రాజు పేర్కొన్నారు.

నిరంతర పర్యవేక్షణ..
మరోవైపు ఉప ఎన్నిక ప్రక్రియను ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోని పరిస్థితిని పర్యవేక్షించారు. 281 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను చేపట్టగా.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

ప్రశాంతంగా పోలింగ్: కలెక్టర్

'బద్వేలులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. బద్వేలు ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు' - కలెక్టర్ విజయరామరాజు

బరిలో ఉన్న అభ్యర్థులు వీరే..

బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత రెండు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో.. అత్యధికంగా ఈసారే 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానానికి చివరిసారిగా 2001లో ఉప ఎన్నిక నిర్వహించగా.. అప్పుడు 14 మంది పోటీలో నిలిచారు. అనంతరం 2004లో ఆరుగురు, 2009లో 12 మంది, 2014లో 13 మంది, 2019లో 14 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థిగా ఆయన భార్య సుధను ప్రకటించడంతో సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీ నుంచి తప్పుకొన్నాయి. ఇక భాజపా తరపున సురేశ్.. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలో నిలిచారు. 

ఇదీ చదవండి:

Jaggareddy: నేను సమైక్యవాదినే.. కేసీఆర్ అలా వస్తే మద్దతిస్తా: జగ్గారెడ్డి

Last Updated : Oct 30, 2021, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details