రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే పలువురు ఓటర్లు కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం 3 గంటల 30 నిమిషాల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
కుప్పకూలిన ఓటరు...
కృష్ణా జిల్లా గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎస్పీ ఆదేశాలతో అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. గన్నవరం బాలురు జడ్పీ పాఠశాలలో ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి ఫిట్స్ రావటంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికుల అప్రమత్తతో చేతిలో తాళాలు పెట్టడంతో సత్వరమే కోలుకుని తిరిగి క్షేమంగా ఇంటికెళ్లాడు.
ఆదోనిలో...
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో తుది విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 6:30 కు ప్రారంభమయ్యాయి. ఆదోని మండలంలో 38 గ్రామపంచాయతీలకు 136 సర్పంచ్, 887 వార్డ్ సభ్యులు పోటీ చేస్తున్నారు.
బారులు తీరిని ఓటర్లు...
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉదయాన్నే ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెనుగొండ...
అనంతపురం జిల్లా పెనుగొండ రెవెన్యూ డివిజన్ లో నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. పెనుగొండ మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఓటర్లు భారీగా కేంద్రాలకు చేరుకున్నారు. హిందూపురం మండలం కిరికెరలో... గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. లేపాక్షి మండలం కోడిపల్లి రెండోవార్డుకు పోలింగ్ నిలిచింది. రిజర్వేషన్‌లో పొరపాటుతో అధికారులు పోలింగ్ వాయిదా వేశారు.
భద్రత కట్టుదిట్టం...
విజయనగరం జిల్లా 10 మండలాల్లో జరుగుతున్న పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 17న సాంకేతిక కారణాలతో నెల్లిమర్ల మండలం ఒమ్మి పంచాయతీ నాలుగోవార్డులో నిలిచిపోయిన ఎన్నికను మళ్లీ నిర్వహిస్తున్నారు. విశాఖ రెవెన్యూ డివిజన్‌లో 68 సమస్యాత్మక పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఓటర్ల హంగామాతో సందడి నెలకొంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో సమస్యాత్మక ప్రాంతాలైన గూడెం చెరువు, పొన్నతోటలో భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పలు కేంద్రాల్లో ఓటర్లు... వర్షాన్ని లెక్కచేయకుండా ఓటింగ్‌లో పాల్గొన్నారు. వర్షం తగ్గకపోవటంతో గొడుగులు వేసుకుని వచ్చి మరీ ఓటు వేస్తున్నారు.
నాలుగో విడత ఎన్నికలకుగానూ రాష్ట్రంలో 28 వేల 995 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,299 పంచాయతీలకు గానూ 554 పంచాయతీల్లో సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కడప జిల్లాలో రెండు చోట్ల సర్పంచి స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకపోవటంతో మొత్తం 2,743 పంచాయతీల్లో ఎన్నిక జరగుతున్నాయి. మొత్తం 67 లక్షల 75 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఇదీ చదవండి:లోయలోపడి సైనికుడి మృతి