రాష్ట్ర రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అధికార వైకాపా.. ప్రతిపక్ష తెదేపాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పట్టాభి వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ధర్నాలు, నిరసనలు, దీక్షల వరకు చేరింది. ఇరుపార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంపై అధికార పార్టీ తీరును ఖండిస్తూ చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తే.. సీఎంపై వ్యాఖ్యలకు నిరసగా రెండు రోజుల పాటు వైకాపా ఆధ్వర్యంలో ప్రజాగ్రహ దీక్షలు చేపట్టారు. వ్యుహాలు, ప్రతివ్యూహాలు రచిస్తూ.. ఎక్కడా తగ్గటం లేదు..! ఇరు పార్టీలు దిల్లీ పర్యటనకు సిద్ధం కావటంతో.. రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
గల్లీ టూ దిల్లీ..!
దెబ్బకు దెబ్బ అన్నట్లు సాగుతున్న రాష్ట్ర రాజకీయం... గల్లీ నుంచి దిల్లీకి చేరేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల అంశాన్ని దిల్లీ స్థాయిలో చర్చకు దారి తీసేలా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్లే చంద్రబాబు దీక్షకు దిగారు. అంతకుముందే.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రహోంశాఖకు లేఖలు రాశారు. వైకాపా పాలన తీరును వివరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని.. కేంద్ర బలగాలను పంపాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నేతల బృందంతో దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి సమయం ఖరారైంది. ఏపీలో నెలకొన్న పరిణామాలతో పాటు రాష్ట్రంలో ఆర్టికల్ 356ని అమలు చేయాలని కోరనున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా ప్రస్తుత పరిస్థితులను తీసుకెళ్లనున్నారు.
ఎత్తుకు పైఎత్తులు..
తెదేపా ఆందోళనలు, నిరసనలపై వ్యూహాత్మక వైఖరితో ముందుకెళ్తోంది వైకాపా. ఏ మాత్రం తగ్గకుండా.. వారికి ధీటుగా నిరసన కార్యక్రమాలను చేపడుతోంది. ప్రస్తుత పరిణామాలు ఏ మాత్రం ప్రతిపక్ష పార్టీకి కలిసిరాకుండా పావులు కదుపుతూ.. ఆ పార్టీ నేత వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. చంద్రబాబు దిల్లీ టూర్‌పై అప్రమత్తమైన వైకాపా పెద్దలు.. హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. తెలుగుదేశాన్ని నిషేధించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ నేత సజ్జల ప్రకటించారు.