5 States Results: లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సత్తా చాటడంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండబోతోందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం? ముందస్తు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మేలు జరుగుతుందనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలకే నష్టమనే భావన కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ముందస్తు వ్యూహం ఫలించి తిరుగులేని విజయం సాధించారు. అప్పుడు తెలంగాణలో భాజపా ఘోర పరాజయం పాలైంది. ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కానీ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 3 నెలలకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా.. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో ప్రభావం చూపించగలిగింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాల్లో కమలం పార్టీ విజయం సాధించి రాజకీయ పరిశీలకుల అంచనాలను తారుమారు చేసింది. ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా సత్తా చాటగా.. నాగార్జున సాగర్‌లో తెరాస విజయం సాధించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా రెండు చోట్ల తెరాస అభ్యర్థులే విజయం సాధించారు. ఒక చోట మాత్రమే భాజపా గట్టి పోటీ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా భాజపా.. అధికారపార్టీకి చెమటలు పట్టించింది. అప్పటి నుంచి తెలంగాణలో భాజపా, తెరాస మధ్య పోరు మరింత ఉద్ధృతమైంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా భాజపా, తెరాస మధ్యే మాటల యుద్ధం కొనసాగుతోంది.
భాజపా దూకుడుకు చెక్ పెట్టేనా?
తెలంగాణలో భాజపాకు చెక్ పెట్టేందుకు తెరాస అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. దేశాన్ని పాలిస్తున్న భాజపా అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తోందని, తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడం లేదనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మత తత్వశక్తుల నుంచి దేశాన్ని కాపాడుకుందామంటూ ఇటీవల దేశ రాజకీయాలపై దృష్టి సారించారు. సమాఖ్య స్ఫూర్తికి కేంద్రంలోని అధికార పార్టీ తూట్లు పొడుస్తుందంటూ.. వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగా ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. వారు కూడా సీఎం కేసీఆర్ పోరాటానికి మద్దతిస్తామని ప్రకటించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సమాజ్ వాదీ పార్టీ నేతలు కూడా హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కలిసి వెళ్లారు. ఇటీవల తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంటే రాష్ట్రం మాదిరిగా దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రకటించారు. ఇందుకోసం తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో భాజపా సత్తా చాటింది.
ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఏమిటో?